కపెర్నహూములో యేసు మొదటిసారి బస చేయడం

యేసు తన కుటుంబంతో, తన తొలి శిష్యులతో కలిసి కపెర్నహూములో మొదటిసారి బస చేస్తాడు.

(తరువాత కపెర్నహూము ఆయన నివాసస్థలం అవుతుంది.)

క్రీ.శ. 26

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన సువార్త 2:12

2:12 ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు.

పస్కా పండుగలో యేసు మొదటిసారి దేవాలయాన్ని శుద్ధి చేయడం క్రీ.శ. 27

యెరూషలేము. బహుశా క్రీ.శ. 27

యోహాను రాసిన సువార్త 2:13–22

2:13 యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 14 అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు. 15 ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు. 16 పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు. 17 ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.

18 అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు. 19 దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు. 20 అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు. 21 అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి. 22 ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.

నికోదేము యేసును కలుసుకోవడం

పస్కా పండుగ సమయంలో యెరూషలేములో

యోహాను రాసిన సువార్త 2:23–3:21

2:23 ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు. 24 అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. 25 ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

3:1 నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతడు యూదుల చట్ట సభలో సభ్యుడు. 2 అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.

5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు. 8 గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”

9 దానికి జవాబుగా నికోదేము, “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అన్నాడు. 10 యేసు ఇలా అన్నాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా? 11 మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు? 13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.

14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.

16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.

21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”