యేసు, యోహాను పక్కపక్కనే పరిచర్య చేయడం
యేసు, బాప్తిసమిచ్చే యోహాను పక్కపక్కనే పరిచర్య చేస్తారు; యోహాను యేసు పట్ల విశ్వాసపాత్రంగా ఉంటాడు.
క్రీ.శ. 27
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన సువార్త 3:22–36
3:22 ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు. 23 సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్చోట నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. 24 అప్పటికి యోహానును ఇంకా చెరసాల్లో వేయలేదు.
25 అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది. 26 వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు. 27 అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
28 నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. 29 పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
31 పై నుండి వచ్చిన వాడు అందరికంటే పైవాడే. భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి గనక భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించీ విన్నవాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్షాన్ని అంగీకరించరు. 33 ఆయన సాక్షాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు. 34 దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. సమస్తాన్నీ ఆయన చేతులకు అప్పగించాడు.
36 కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”
క్రీస్తు యూదయను విడిచిపోవడానికి కారణం
మత్తయి రాసిన సువార్త 4:12
4:12 యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.
మార్కు రాసిన సువార్త 1:14
1:14 యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
లూకా రాసిన సువార్త 3:19–20; 4:14
3:19 అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు. 20 హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.
4:14 అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
యోహాను రాసిన సువార్త 4:1–4
4:1 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది. 2 నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు. 3 అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు. 4 మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది.