మూడు గంటల చీకటి

మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు, మూడు గంటల చీకటి.

(చీకటి ముగిసే సమయంలో మరో నాలుగు మాటలు, క్రీస్తు మరణం.)

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 27:45–50

27:45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.

46 సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.

47 అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.

48 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు.

49 మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.

50 యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.

మార్కు రాసిన సువార్త 15:33–37

15:33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.

34 మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.

35 దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.

36 ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు.

37 అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.

లూకా రాసిన సువార్త 23:44–46

23:44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.

45 సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.

46 అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.

యోహాను రాసిన సువార్త 19:28–30

19:28 దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు.

29 అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.

30 యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.

క్రీస్తు మరణంతో పాటు జరిగిన సంఘటనలు

మత్తయి రాసిన సువార్త 27:51–56

27:51 అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52 సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53 వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.

54 రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.

55 యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.

56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.

మార్కు రాసిన సువార్త 15:38–41

15:38 ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.

39 యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు.

40 కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు.

41 యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.

లూకా రాసిన సువార్త 23:47–49

23:47 శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.

48 ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు.

49 ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.