సిలువపై మొదటి మూడు గంటలు

శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు (యేసు పలికిన మూడు మాటలు; యేసు వస్త్రం కోసం సైనికులు జూదమాడడం; సిలువపై శాసనం; జనసమూహం, మహాసభ, సైనికులు, క్రీస్తుకు ఇరువైపులా ఉన్న ఇద్దరు దొంగలు సైతం యేసును అపహసించడం)

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 27:35–44

27:35 వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.

36 అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.

37 “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.

38 ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.

39 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40 “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు.

41 అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42 “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.

43 ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.

44 ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.

మార్కు రాసిన సువార్త 15:24–32

15:24 ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు.

25 ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26 “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.

27 ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. 28 ‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.

29 ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! 30 ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు.

31 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు!

32 ‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.

లూకా రాసిన సువార్త 23:34, 38, 35–37, 39–43

23:34 అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.

38 “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు.

35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు.

36 ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ

37 “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.

39 వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.

40 కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41 మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.

42 తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43 అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

యోహాను రాసిన సువార్త 19:18, 23–24, 19–22, 25–27

19:18 అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు.

23 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, 24 వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు.

“నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు,

నా దుస్తుల కోసం చీట్లు వేశారు,”

అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.

19 పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు. 20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు.

21 యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు. 22 పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు.

25 యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26 ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. 27 తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.