రోమీయుల సైనికులు యేసును అపహసించడం
శుక్రవారం, ఉదయం 6 నుండి 9 గంటల మధ్య
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 27:27–30
27:27 అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు.
28 వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.
29 ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. 30 ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.
మార్కు రాసిన సువార్త 15:16–19
15:16 సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.
17 వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు.
18 ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19 రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు.
సిలువ వైపు దారిలో యేసు
గొల్గొతాపై సిలువ వైపు దారిలో (వియా డోలోరోసా) యేసు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ముందు
మత్తయి రాసిన సువార్త 27:31–34
27:31 అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.
32 వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
33 వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు.
34 అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.
మార్కు రాసిన సువార్త 15:20–23
15:20 ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.
21 కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు.
22 వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం.
23 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.
లూకా రాసిన సువార్త 23:26–33
23:26 వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు.
27 పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
28 యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
29 వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి.
30 అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.
31 చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు.
32 ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
యోహాను రాసిన సువార్త 19:17
19:17 తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.