రెండవసారి పిలాతు ఎదుట యేసు

శుక్రవారం సూర్యోదయ సమీపంలో (యోహాను 19:14)

క్రీస్తును సిలువ వేయాలన్న మహాసభ డిమాండుకు పిలాతు నెమ్మదిగా, అయిష్టంగా, భయంతో తలొగ్గుతాడు.

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 27:15–26

27:15 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక.

16 ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.

17 కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?”

18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.

19 అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది.

20 ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.

21 పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు.

22 అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు.

23 పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.

24 అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. 25 అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.

26 అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.

మార్కు రాసిన సువార్త 15:6–15

15:6 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ.

7 బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. 8 జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు.

9 పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు.

10 ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.

11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.

12 పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు.

13 వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు.

14 పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.

15 ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.

లూకా రాసిన సువార్త 23:13–25

23:13 అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు. 14 “ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు. 15 హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు.

16 అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.

17 పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక.

18 అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు. 19 బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు.

20 పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు. 21 కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు.

22 మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు.

23 కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి.

24 వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు.

25 వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.

యోహాను రాసిన సువార్త 18:39–19:16

18:39 పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు.

40 అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.

19:1 ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. 2-3 సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు.

4 పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. 5 కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు.

6 ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు.

7 యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు.

8-9 పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. 10 అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.

11 యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. 12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. 13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు.

14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.

15 వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.

16 అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.