అప్పగించిన యూదా పశ్చాత్తాపం, ఆత్మహత్య

దేవాలయంలో, యెరూషలేము ప్రాకారాల వెలుపల ఒక స్థలంలో. శుక్రవారం ఉదయం

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 27:3–10

27:3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4 “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు.

7 వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. 8 ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు. 9 దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు. 10 వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది.

మొదటిసారి పిలాతు ఎదుట యేసు

యెరూషలేము. శుక్రవారం, తెల్లవారుజామున

మత్తయి రాసిన సువార్త 27:2, 11–14

27:2 ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.

11 యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు.

12 ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.

13 కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు.

14 అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది.

మార్కు రాసిన సువార్త 15:2–5

15:2 పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు.

3 ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు.

4 కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు.

5 అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.

లూకా రాసిన సువార్త 23:1–5

23:1 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. 2 “ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు.

3 అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు.

4 పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు.

5 అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.

యోహాను రాసిన సువార్త 18:28–38

18:28 వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. 29 కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు.

30 వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. 31 అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. 32 తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. 33 అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు.

34 యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. 35 అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు.

36 యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. 37 అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు.

38 పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు.

అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,

చతుర్థాధిపతి హేరోదు అంతిపా ఎదుట యేసు

యెరూషలేము. శుక్రవారం, తెల్లవారుజామున

లూకా రాసిన సువార్త 23:6–12

23:6 పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు. 7 ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.

8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు. 9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.

10 ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. 11 హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. 12 అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు.