పేతురు తన ప్రభువును మూడుసార్లు నిరాకరించడం
ప్రధాన యాజకుని నివాస ప్రాంగణం, వరుస విచారణలు జరుగుతున్నప్పుడు. శుక్రవారం తెల్లవారకముందు, తెల్లవారే సమయానికి
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 26:58, 69–75
26:58 పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది.
70 అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు.
71 అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది.
72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు.
74 దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
75 “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
మార్కు రాసిన సువార్త 14:54, 66–72
14:54 పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు.
66 పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది.
67 పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది.
68 పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.
69 ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది.
70 పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు.
71 అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.
72 వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.
లూకా రాసిన సువార్త 22:55–62
22:55 అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.
56 అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది.
57 దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు.
58 కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.
59 మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు.
60 అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
61 అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. 62 దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
యోహాను రాసిన సువార్త 18:15–18, 25–27
18:15 సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు. 16 కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు.
17 గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు. 18 చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు.
25 అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు.
26 పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు.
27 పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
తెల్లవారిన తరువాత యూదుల మహాసభ యేసును అధికారికంగా దోషిగా తీర్చడం
శుక్రవారం
మత్తయి రాసిన సువార్త 27:1
27:1 తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.
మార్కు రాసిన సువార్త 15:1
15:1 తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
లూకా రాసిన సువార్త 22:66–71
22:66 ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు. 67 “నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. 68 అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు. 69 అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు. 70 “అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు. 71 అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.