అన్న మొదట యేసును విచారించడం

మాజీ ప్రధాన యాజకుడైన అన్న మొదట యేసును విచారిస్తాడు.

శుక్రవారం తెల్లవారకముందు

యూదుల విచారణ, దాని చుట్టూ జరిగిన సంఘటనలు.

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన సువార్త 18:13–14, 19–23

18:13 మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ. 14 ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.

19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. 20 యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. 21 నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు.

22 యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. 23 యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు.

కయప, మహాసభ యేసును దోషిగా తీర్చడం

కయప, మహాసభ యేసును హడావుడిగా విచారించి దోషిగా తీర్చి, ఆయనను అపహసించి కొడతారు.

ప్రధాన యాజకుడైన కయప నివాసం. శుక్రవారం తెల్లవారకముందు

మత్తయి రాసిన సువార్త 26:57, 59–68

26:57 యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.

59 ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు.

60 అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు.

61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు.

62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.

63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు.

64 అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. 65 వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది?

66 మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు.

67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.

68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు.

మార్కు రాసిన సువార్త 14:53, 55–65

14:53 వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు.

55 ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు.

56 చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.

57 అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ,

58 “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. 59 కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.

60 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు.

61 కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు.

62 అప్పుడు యేసు, “నేనే.

మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం,

పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు.

63 ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? 64 ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.

65 అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు.

లూకా రాసిన సువార్త 22:54, 63–65

22:54 వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.

63 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.

64 ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.

65 ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.

యోహాను రాసిన సువార్త 18:24

18:24 తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు.