భాగం 13: యేసు అరెస్టు, విచారణ, సిలువ మరణం, సమాధి
శ్రమల వారంలోని గురువారం రాత్రి, శుక్రవారం, శనివారం (దేవుని రాజ్యానికి చీకటి రోజులు)
యేసును అప్పగించడం, అరెస్టు చేయడం, విడిచిపెట్టడం
గేత్సేమనే తోట. శుక్రవారం, తెల్లవారడానికి చాలా ముందు
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 26:47–56
26:47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి.
48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
49 అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు.
52 అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు.
53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? 54 నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.
55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే,
56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు.
మార్కు రాసిన సువార్త 14:43–52
14:43 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి.
44 ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు.
45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.
46 అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.
47 అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు.
48 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా?
49 నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.” 50 అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.
51 ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. 52 కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు.
లూకా రాసిన సువార్త 22:47–53
22:47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
48 అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
49 ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు.
50 ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
51 దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
52 తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
53 నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.
యోహాను రాసిన సువార్త 18:2–12
18:2 యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు.
3 అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. 4 అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. 5 వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు. 6 ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు.
7 ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు. 8 యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. 9 “నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు.
10 అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు.
11 యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.
12 అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.