గేత్సేమనేలో యేసు చాలాసేపు తీవ్ర వేదన అనుభవించడం

గేత్సేమనేకు వెళ్ళి, యేసు చాలాసేపు తీవ్ర వేదన అనుభవిస్తాడు.

కెద్రోను వాగుకూ ఒలీవ చెట్ల కొండ పాదానికీ మధ్య ఉన్న బహిరంగ తోటలో. శుక్రవారానికి దారితీసే రాత్రి బాగా పొద్దుపోయాక

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 26:30, 36–46

26:30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.

36 ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు.

37 పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.

38 అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.

40 శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?

41 మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.

42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు.

43 ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.

44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.

45 అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.

46 ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”

మార్కు రాసిన సువార్త 14:26, 32–42

14:26 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.

32 అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు.

33 అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు.

34 ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను.

మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి,

35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు.

36 ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.

37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా?

38 మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు.

39 ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.

40 ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు.

41 మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు.

42 వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”

లూకా రాసిన సువార్త 22:39–46

22:39 భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.

40 వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.

41 వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.

42 “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.” 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.

44 ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది. 45 ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.

46 వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.

యోహాను రాసిన సువార్త 18:1

18:1 యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.