అరిమతయి యోసేపు సమాధిలో యేసును సమాధి చేయడం

ఆయన మరణం నిర్ధారణ అయిన తరువాత, యేసు దేహాన్ని అరిమతయి యోసేపు సమాధిలో ఉంచుతారు.

శుక్రవారం మధ్యాహ్నం, సాయంత్రం 6 గంటలకు ముందు

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 27:57–60

27:57 ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.

58 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.

59 యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.

60 తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.

మార్కు రాసిన సువార్త 15:42–46

15:42 అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.

43 యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.

44 యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45 ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.

46 యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.

లూకా రాసిన సువార్త 23:50–54

23:50 యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. 51 మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

52 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.

53 తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.

54 అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.

యోహాను రాసిన సువార్త 19:31–42

19:31 అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. 32 కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. 33 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.

34 అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. 35 ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. 36 “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. 37 “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.

38 ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు.

39 మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.

40 వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. 41 ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.

42 ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.

యేసు సమాధి దగ్గర స్త్రీలు కనిపెట్టుకుని ఉండడం

శుక్రవారం మధ్యాహ్నం నుండి శనివారం మధ్యాహ్నం వరకు

స్త్రీలు కనిపెట్టుకుని ఉండి, విశ్రాంతి దినం (సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది) నాడు విశ్రమిస్తారు. పరిసయ్యులు మాత్రం సమాధిపై ఉన్న రోమీయుల ముద్రకు రోమీయుల సైనికుల చేత కాపలా కాయిస్తారు.

మత్తయి రాసిన సువార్త 27:61–66

27:61 మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.

62 ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, 63 “అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. 64 కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు.

65 అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు. 66 వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.

మార్కు రాసిన సువార్త 15:47

15:47 మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.

లూకా రాసిన సువార్త 23:55–56

23:55 అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి 56 తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.