భాగం 14: క్రీస్తు పునరుత్థానం, ఆరోహణం

క్రీస్తు పునరుత్థానం, ప్రత్యక్షతలు, ఆరోహణం.

క్రీస్తు మరణం తరువాతి ఆదివారం మొదలుకొని నలభై రోజులపాటు. క్రీ.శ. 30 (లేదా 29) వసంతకాలం. యూదయ, గలిలయ

స్త్రీలు యేసు సమాధిని సందర్శించడం

గొల్గొతా, బేతనియ. మన లెక్క ప్రకారం శనివారం మధ్యాహ్నం చివరి భాగం, సాయంత్రం తొలి భాగం

వారు విశ్రాంతి దినం చివరి భాగంలో (మన లెక్క ప్రకారం శనివారం మధ్యాహ్నం) సమాధిని కనిపెట్టుకుని ఉంటారు. విశ్రాంతి దినం తరువాత (శనివారం సాయంత్రం 6 గంటల తరువాత), వారంలోని మొదటి రోజున సుగంధ ద్రవ్యాలను కొంటారు.

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 28:1

28:1 విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.

మార్కు రాసిన సువార్త 16:1

16:1 విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.

ఒక దేవదూత రాయిని దొర్లించడం

భూకంపం వస్తుంది, ఒక దేవదూత రాయిని దొర్లిస్తాడు, రోమీయుల కాపలావారు భయభ్రాంతులవుతారు.

ఆదివారం సూర్యోదయానికి ముందు

మత్తయి రాసిన సువార్త 28:2–4

28:2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. 3 ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.

4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.

ఖాళీ సమాధి గురించి దేవదూతలు స్త్రీలకు చెప్పడం

ఆదివారం ఉదయం సూర్యోదయానికి అటూఇటుగా స్త్రీలు యేసు సమాధిని సందర్శిస్తారు, దేవదూతలు వారికి ఖాళీ సమాధిని గురించిన సందేశాన్ని ఇస్తారు.

గొల్గొతా. ఆదివారం తెల్లవారుజామున

మత్తయి రాసిన సువార్త 28:5–8

28:5 ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. 6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి,

7 త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.

8 వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా

మార్కు రాసిన సువార్త 16:2–8

16:2 ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, 3 “మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

4 వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది.

5 వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.

6 అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.

7 మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”

8 ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.

లూకా రాసిన సువార్త 24:1–8

24:1 ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు.

2 సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. 3 కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు.

4 అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు.

5 వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు?

6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు 7 మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు.

8 అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.

యోహాను రాసిన సువార్త 20:1

20:1 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.

పేతురు, యోహాను ఖాళీ సమాధిని సందర్శించడం

మగ్దలేనే మరియ, ఇతర స్త్రీలు అపొస్తలులకు తెలియజేస్తారు, పేతురు, యోహాను ఖాళీ సమాధిని సందర్శిస్తారు.

లూకా రాసిన సువార్త 24:9–12

24:9 వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.

10 ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ.

11 అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు.

12 అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.

యోహాను రాసిన సువార్త 20:2–10

20:2 కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది.

3 కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు.

4 వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు. 5 అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు. 6 ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.

7 అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు. 8 ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు. 9 అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు. 10 అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.