పది గోత్రాలను చెరలోకి తీసుకుపోవడం
హోషేయ పాలన కొనసాగింపు. పది గోత్రాలను చెరలోకి తీసుకుపోతారు.
క్రీ.పూ. 723
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
5 అష్షూరురాజు దేశమంతటి మీదకీ, షోమ్రోను మీదకీ వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు. 6 హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.
7 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచీ, ఐగుప్తు రాజు ఫరో బలం నుంచీ, తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపం చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు. 8 తమ ఎదుట నిలవ లేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల కట్టుబాట్లూ, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టుబాట్లూ పాటిస్తూ ఉన్నారు.
9 ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ, తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీదా ప్రాకారాల మీదా పూజా స్థలాలు కట్టుకున్నారు. 10 ఎత్తయిన కొండలన్నిటి మీదా, ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు కట్టించారు. 11 తమ యెదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ, దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించారు. 12 “చెయ్యకూడదు” అని వేటి గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేస్తూ పూజిస్తూ ఉన్నారు.
13 “అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి” అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు.
14 అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వికుల వలే వారు కూడా తలబిరుసుగా ఉన్నారు. 15 వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. “వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు” అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.
16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు. 17 ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు. 18 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు గనుక యూదా గోత్రం తప్ప ఇంక ఏ గోత్రమూ మిగలలేదు.
19 అయితే యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి ఇశ్రాయేలు వారు పెట్టుకొన్న కట్టడలనే అనుసరించారు. 20 అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి, వాళ్ళను బాధపెట్టి, దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి, వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు.
21 ఆయన ఇశ్రాయేలు గోత్రాలను దావీదు సంతానం నుంచి విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకు యరొబామును రాజుగా చేసుకున్నారు. యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా, వారు ఆయన మీద తిరుగుబాటు చేసేలా చేసి, ఘోరమైన పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు. 22 ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. 23 తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆయన ఇశ్రాయేలు వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్ళగొట్టాడు. అందువల్ల వారు తమ స్వదేశం నుంచి అష్షూరు దేశానికి బందీలుగా వెళ్ళారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
9 రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు. 10 మూడు సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో ఆరో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో షోమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది.
11 ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు. 12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశానికి తీసుకెళ్ళి, గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు.