భాగం 14: మనష్షే పాలన
యూదా రాజ్యం
మనష్షే విగ్రహారాధన
క్రీ.పూ. 698
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లిపేరు హెప్సిబా. 2 అతడు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసినట్లు అసహ్యమైన పనులు చేస్తూ వచ్చాడు. 3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.
4 ఇంకా “నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను” అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు. 5 ఇంకా, యెహోవా మందిరానికి ఉన్న రెండు ప్రాంగణాల్లో ఆకాశ నక్షత్రాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. 6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
7 యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి “ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్రస్దానాల్లో నుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను” అని దేన్నీ గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరంలో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు. 8 ఇంకా “ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దానంతటినీ నా సేవకుడు మోషే వాళ్లకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్నీ వారు పాటిస్తే, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశంలో నుంచి వాళ్ళ పాదాలు ఇంక తొలగి పోనివ్వను” అని యెహోవా చెప్పిన మాట వినకుండా 9 ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడకుండా యెహోవా నాశనం చేసిన ప్రజలు జరిగించిన చెడుతనాన్ని మించిన చెడుతనం చేసేలా మనష్షే వాళ్ళను పురిగొల్పాడు.
10 అయితే, యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ, 11 “యూదా రాజు మనష్షే ఈ అసహ్యమైన పనులు చేసి, తన ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొన్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు. 12 కాబట్టి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, వినేవాళ్ళకు రెండు చెవులూ గింగురుమనేంత కీడు యెరూషలేము మీదకీ, యూదావాళ్ళ మీదకీ రప్పిస్తాను.
13 నేను షోమ్రోనును కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను. 14 ఇంకా, నా స్వాస్ధ్యంలో మిగిలిన వాళ్ళను నేను తోసివేసి, వాళ్ళ శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. 15 వారు తమ పూర్వికులు ఐగుప్తు దేశంలోనుంచి వచ్చిన రోజునుంచి ఈ రోజు వరకూ నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుక వారు తమ శత్రువులందరివల్ల దోపిడీకి గురై నష్టం పొందుతారు.”
16 ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు.
షెబ్నా చెర గురించి యెషయా ప్రవచించడం
15 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా చెప్పాడు. భవనంలో నిర్వహణా పనులు చూసే షెబ్నా దగ్గరకి వెళ్ళు. అతనికి ఇలా చెప్పు.
16 “ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు?
ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!
17 చూడు, బలవంతుడివైన నిన్ను యెహోవా విసిరి వేయబోతున్నాడు. ఆయన నిన్ను నేలకు విసిరి కొట్టబోతున్నాడు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు.
18 ఆయన నిన్ను కచ్చితంగా చుట్ట చుట్టివేస్తాడు. ఒక బంతిలా నిన్ను విశాలమైన దేశంలోకి విసిరివేస్తాడు.
నువ్వు అక్కడే చనిపొతావు. నీ గొప్ప రథాలు కూడా అక్కడే పడి ఉంటాయి. నీ యజమాని ఇంటికి నువ్వు ఒక అవమానంగా ఉంటావు.
19 నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగిస్తాను. నీ హోదాను తీసి వేస్తాను. నిన్ను కిందకు లాగేస్తాను.
20 ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను.
21 నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను.
అతడు యెరూషలేములో నివాసం ఉన్న వాళ్ళకీ, యూదా జాతి వాళ్ళకీ ఒక తండ్రిగా ఉంటాడు.
22 నేను దావీదు ఇంటి తాళపు చెవిని, అధికారాన్ని అతని భుజంపై ఉంచుతాను.
అతడు తెరచినప్పుడు ఎవ్వరూ మూయలేరు. అతడు మూసినప్పుడు ఎవ్వరూ తెరవలేరు.
23 బలమైన చోట ఒక మేకును దిగగొట్టినట్టు నేను అతణ్ణి స్థిరపరుస్తాను.
అతడు తన తండ్రి కుటుంబానికి ఘనమైన సింహాసనంగా ఉంటాడు.
24 చిన్న గిన్నెలనూ, పాత్రలనూ మేకుకి వేలాడదీసినట్టుగా
అతని పితరుల ఇంటి గౌరవమూ, సంతానం, వారసుల గౌరవమూ అతనిపై వేలాడదీస్తారు.”
25 ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. “ఆ రోజున బలమైన చోట కొట్టిన మేకు సడలి ఊడిపోతుంది. కింద పడిపోతుంది. దానిపై ఆధారపడిన బరువంతా తెగి కింద పడుతుంది.” ఇది యెహోవా మాట.