మనష్షే చెర, మరణం

క్రీ.పూ. 676

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 33:11–20

11 కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు. 12 బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు. 13 అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు.

14 దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు. 15 యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు.

16 అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు. 17 అయినా ప్రజలు ఎత్తయిన స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు. 18 మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు దేవునికి చేసిన ప్రార్థన గురించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘ దర్శకుల మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.

19 అతని ప్రార్థన, దేవునికి ఎలా మొర్రపెట్టాడో, తనను తాను తగ్గించు కొనక ముందు అతని పాపం గురించి, అతడు చేసిన ద్రోహం గురించి, కట్టించిన ఎతైన పూజా స్థలాలూ అషేరాదేవి స్తంభాలు, చెక్కిన విగ్రహాలను నిలపడం గురించి, దీర్ఘదర్శకుడలు రచించిన గ్రంథాల్లో రాసి వుంది. 20 మనష్షే చనిపోయినప్పుడు తన పూర్వీకులతో కూడ తన సొంత భవనంలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు ఆమోను అతనికి బదులు రాజయ్యాడు.

2 రాజులు 21:17–18

17 మనష్షే చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 18 మనష్షే తన పూర్వీకులతో బాటు చనిపోయిన తరువాత, ఉజ్జా తోటలో తన ఇంటి దగ్గర అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఆమోను అతని స్థానంలో రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు 33:1–10

1 మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు. 2 ఇతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు. 3 ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి, అషేరా దేవతాస్తంభాలను చేయించి, ఆకాశనక్షత్రాలన్నిటిని పూజించి కొలిచాడు.

4 “యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు. 5 యెహోవా మందిరపు రెండు ఆవరణాల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు. 6 బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

7 “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను. 8 నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనడానికి వారు జాగ్రత్తపడితే, మీ పూర్వీకులకు నేను ఏర్పరచిన దేశం నుంచి ఇశ్రాయేలీయులను నేను ఇక ఎన్నటికీ తొలగించను” అని దావీదుతో అతని కొడుకు సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరంలో తాను చేయించిన అషేరా చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు. 9 యూదావారిని యెరూషలేము నివాసులనూ ఇశ్రాయేలీయుల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన రాజ్యాలకంటే వారు మరింత దుర్మార్గంగా ప్రవర్తించేలా మనష్షే వారిని నడిపించాడు.

10 యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు.

పూర్వం పది గోత్రాలకు చెందిన భూభాగాలు క్రీ.పూ. 678

ఒకప్పుడు పది గోత్రాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల స్థితి.

2 రాజులు 17:24–41

24 అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అనే తన దేశాల్లో నుంచి మనుషులను రప్పించి, ఇశ్రాయేలు వాళ్లకు బదులుగా షోమ్రోను పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు. వారు షోమ్రోను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ పట్టణాల్లో కాపురం ఉన్నారు. 25 అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి. 26 అప్పుడు వారు “మీరు పట్టుకొన్న షోమ్రోను పట్టణాల్లో మీరు ఉంచిన ప్రజలకు ఆ దేశపు దేవుని ఆచారాలు తెలియదు గనక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని ఆచారాలు వాళ్లకు తెలియని కారణంగా సింహాలు వాళ్ళను చంపుతున్నాయి” అని అష్షూరు రాజుతో చెప్పారు.

27 అష్షూరు రాజు “అక్కడ నుంచి తెచ్చిన యాజకుల్లో ఒకణ్ణి మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అతడు అక్కడికి వెళ్లి కాపురం ఉండి, ఆ దేశపు దేవుని ఆచారాలను వాళ్లకు నేర్పాలి” అని ఆజ్ఞాపించాడు. 28 అప్పుడు షోమ్రోనులోనుంచి వారు పట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు.

29 అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొన్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా, వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు. 30 బబులోను వారు సుక్కో తు బెనోతు దేవుణ్ణి, కూతా వారు నెర్గలు దేవుణ్ణి, హమాతు వారు అషీమా దేవుణ్ణి, 31 ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.

32 ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. అ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు. 33 ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు.

34 ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు. 35 ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి “మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు. వాటికి మొక్కకూడదు. పూజ చేయకూడదు. బలులు అర్పించకూడదు. 36 ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి గొప్ప బలప్రభావాలతో చాచిన తన బహువుతో బయటికి తెచ్చాడో ఆయన్నే మీరు పూజించాలి. ఆయనకే మొక్కాలి. ఆయనకే బలులు అర్పించాలి. 37 శాశ్వతంగా మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలు, విధులు, అంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, అన్నీ మీరు పాటించాలి. ఇతర దేవుళ్ళకు భయపడ కూడదు. 38 నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి. 39 మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవుని పైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు” అని యెహోవా చెప్పాడు.

40 అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు. 41 ఆ ప్రజలు ఆ విధంగా యెహోవా పట్ల భయ భక్తులు కలిగి ఉంటూనే, తమ చెక్కిన విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు. వారి పిల్లలూ, పిల్లల పిల్లలూ అలానే చేశారు. వారి పూర్వికులు చేసినట్టే ఈ రోజు వరకూ చేస్తూనే ఉన్నారు.