భాగం 15: ఆమోను పాలన

క్రీ.పూ. 643

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 21:19–26

19 ఆమోను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండు సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మెషుల్లెమెతు. ఆమె యొట్బ ఊరివాడైన హారూసు కూతురు. 20 అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

21 తన పితరుల దేవుడైన యెహోవాను వదిలిపెట్టి, యెహోవా మార్గంలో నడవకుండా, తన తండ్రి ప్రవర్తించినట్టు తానూ ప్రవర్తిస్తూ, 22 తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు. 23 ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు.

24 దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వాళ్ళందర్నీ చంపి, అతని స్థానంలో అతని కొడుకు యోషీయాకు పట్టాభిషేకం చేశారు. 25 ఆమోను చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 26 ఉజ్జా తోటలో అతనికి ఉన్న సమాధిలో అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు యోషీయా అతని స్థానంలో రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు 33:21–25

21 ఆమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 22 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పాలించాడు. 22 అతడు తన తండ్రి మనష్షే నడచినట్టు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు. తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు. 23 తన తండ్రియైన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు.

24 అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనంలోనే అతణ్ణి చంపేశారు. 25 అయితే దేశప్రజలు ఆమోను రాజుమీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కొడుకు యోషీయాను అతని స్థానంలో రాజుగా నియమించారు.