దేవాలయానికి పునాది వేయడం

క్రీ.పూ. 536

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎజ్రా 3:8–13

8 యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ, చెరలో నుండి విడుదలై యెరూషలేముకు వచ్చిన వారు, అందరూ కలిసి పని ప్రారంభించారు. ఇరవై సంవత్సరాలు నిండిన లేవీయులు యెహోవా మందిరం కట్టే పనికి నియమితులయ్యారు.

9 యేషూవ కొడుకులు, సహోదరులు, కద్మీయేలు, అతని కొడుకులు, యుదా కొడుకులు, హేనాదాదు కొడుకులు, అతని మనుమలు, లేవీయులైన వారి బంధువులు దేవుని మందిరంలో పని చేసేవారిపై పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

12 గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో, లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలామంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషంతో గట్టిగా కేకలు వేశారు. 13 ఏవి ఏడుపులో, ఏవి హర్ష ధ్వానాలో ప్రజలు తెలుసుకోలేక పోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది.

కీర్తనలు 84

ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. కోరహు వారసుల కీర్తన.

1 సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!

2 యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.

3 సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.

4 నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సెలా

5 ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.

6 వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.

7 వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.

8 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. సెలా.

9 దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.

10 నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.

11 యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.

12 సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.

కీర్తనలు 66

ప్రధాన సంగీతకారుని కోసం

1 సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.

2 ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.

3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

4 లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.

5 దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు.

6 ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. ప్రజలు కాలినడకన నదిని దాటారు. అక్కడ ఆయనలో మేము సంతోషించాము.

7 ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు. ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి. తిరుగుబాటుచేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు.

8 జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.

9 మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే. ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు.

10 దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించావు. వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు.

11 మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు.

12 మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు.

13 దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.

14 నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలు, నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులు నేను నీకు అర్పిస్తాను.

15 పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను.

16 దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి, ఆయన నా కోసం చేసిన కార్యాలు నేను వినిపిస్తాను.

17 ఆయనకు నేను మొరపెట్టాను. అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది.

18 నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.

19 కానీ దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు.

20 దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.