దేవాలయ పని నిలిచిపోవడం; దానియేలు చివరి దర్శనం
క్రీ.పూ. 536
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా, బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది. 2 వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
3 అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరెషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం” అని వారితో చెప్పారు.
4 ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు. 5 అంతేకాక, పర్షియా దేశపు రాజు కోరెషు కాలమంతటిలో, పర్షియా రాజు దర్యావేషు పాలనా కాలం వరకూ ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు.
24 కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.
యాత్రల కీర్తన
1 ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు.
2 నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.
3 భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు.
4 యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు.
5 సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.
6 వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి.
7 కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.
8 ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.
1 పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.
2 ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను. 3 మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు. 4 మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.
5 నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 6 అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.
7 దానియేలు అనే నాకు ఈ దర్శనం కలిగినప్పుడు నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గానీ భయంతో గడగడా వణుకుతూ దాక్కోవాలని పారిపోయారు. 8 నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది. 9 నేను అతని మాటలు విన్నాను. నేను అతని మాటలు విని నేలపై సాష్టాంగపడి గాఢనిద్ర పోయాను.
10 అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి 11 “దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.
12 అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. 13 పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
14 ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
15 అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను. 16 అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది. 17 తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా 18 అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు. 19 నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు.
అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను. 20 అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు. 21 అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”