చెర నుండి యూదులు తిరిగి రావడం (continued)

క్రీ.పూ. 536

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 116–117

1 యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.

2 ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.

3 మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది.

4 అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.

5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

7 నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.

8 మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.

9 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.

10 నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.

11 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.

12 యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?

13 రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.

14 యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.

15 యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.

16 యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.

17 నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను

18 ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.

19 యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

117:1 యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి.

2 ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు 125

యాత్రల కీర్తన

1 యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.

2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.

3 నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.

4 యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు.

5 తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

కీర్తనలు 127–128

సొలొమోను రాసిన యాత్రల కీర్తన

1 యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.

2 మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.

3 చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

4 యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.

5 వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.

యాత్రల కీర్తన.

128:1 యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు.

2 నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు.

3 నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు.

4 యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు.

5 సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక. నువ్వు జీవిత కాలమంతా యెరూషలేము సుసంపన్నం కావడం చూస్తావు.

6 నీ మనవలు, మనవరాళ్ళను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

కీర్తనలు 134

యాత్రల కీర్తన

1 యెహోవా సేవకులు, ఆయన మందిరంలో రాత్రివేళ నిలిచి సేవించే వాళ్ళంతా రండి. యెహోవాను కీర్తించండి.

2 పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి.

3 భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవా సీయోనులోనుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.