చెర నుండి యూదులు తిరిగి రావడం (continued)

క్రీ.పూ. 536

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 87

కోరహు వారసుల కీర్తన. ఒక పాట.

1 పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.

2 యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.

3 దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా

4 రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.

5 సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.

6 యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. సెలా

7 గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు.

కీర్తనలు 111–114

1 యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.

2 యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.

3 ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

4 ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.

5 తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.

6 ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.

7 ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.

8 అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.

9 ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.

10 యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.

112:1 యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.

2 అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.

3 కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.

4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.

5 జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.

6 అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.

7 అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.

8 అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.

9 అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.

10 భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.

113:1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.

2 ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.

3 సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.

4 యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.

5 ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?

6 ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.

7 ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.

8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.

9 ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

114:1 ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు,

2 యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది.

3 సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.

4 పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.

5 ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?

6 పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?

7 భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.

8 ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.