రూతు కథ (continued)

క్రీ.పూ. 1245

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రూతు 3–4

1 తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. “అమ్మా, నువ్వు స్థిరపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి. 2 ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు. 3 నువ్వు స్నానం చేసి సువాసన నూనె రాసుకుని బట్టలు మార్చుకుని ఆ పొలానికి ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళు. అతని భోజనం ముగించి నిద్రపోయేంత వరకూ అతనికి కనిపించవద్దు. 4 నిద్రపోయిన తరువాత ఎక్కడ పడుకున్నాడో చూడు. ఆ చోటికి నువ్వూ వెళ్ళగలిగేలా దాన్ని గుర్తు పెట్టుకో. తరువాత అక్కడికి వెళ్ళి అతని కాళ్ళపై ఉన్న దుప్పటి తీసి అక్కడ పడుకో. ఆ తరువాత జరగాల్సిందంతా అతనే చెబుతాడు.” 5 అప్పుడు రూతు “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అంది.

6 ఆమె ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళి తన అత్త తనకు చెప్పినట్లు చేసింది. 7 బోయజు భోజనం చేసి ద్రాక్షారసం తాగి మనస్సులో ఉల్లాసంగా పోయి ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. అప్పుడు రూతు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి తీసి పడుకుంది. 8 అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది. 9 అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది. 10 అతడు “అమ్మాయీ, నిన్ను యెహోవా దీవించాడు. పేదవారు, ధనికులు అయిన యువకులపై నువ్వు మోజు పడలేదు. అందుకని గతంలో నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరింత యోగ్యంగా ఉంది. 11 అమ్మాయీ, ఇప్పుడిక భయపడవద్దు. నీకు నేను చెప్పేదంతా తప్పక నెరవేరుస్తాను. నువ్వు చాలా యోగ్యురాలివి అని ప్రజలందరికీ తెలుసు. 12 నేను నిన్ను విడిపించగలను అనే మాట నిజమే. కానీ నీకు నాకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు. 13 ఈ రాత్రి ఉండు. ఉదయాన్నే ఆ వ్యక్తి నీకు బంధువుగా ధర్మం జరిపి నిన్ను విడిపించవచ్చు. నీకు బంధువు ధర్మం జరపడం అతనికి ఇష్టం లేకపోతే నేనే బంధువుగా ఆ ధర్మాన్ని జరిగిస్తానని యెహోవా తోడుగా ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారే వరకూ నిద్రపో” అన్నాడు.

14 కాబట్టి ఆమె తెల్లారే వరకూ అతని కాళ్ళ దగ్గర పడుకుని ఇంకా తెల్లవారకముందే లేచింది. అప్పుడు అతడు “ఆమె ధాన్యం చెరిగించే కళ్ళం దగ్గరికి వచ్చిన విషయం ఎవరికీ చెప్పవద్దు” అని తన సేవకులకు చెప్పాడు. 15 తరువాత అతడు “నువ్వు కప్పుకున్న దుప్పటి పట్టు” అనగా ఆమె దాన్ని పట్టింది. అతడు ఆరు కొలతల బార్లీ గింజలు కొలిచి ఆమె భుజానికెత్తాడు. ఆమె ఊళ్లోకి వెళ్ళిపోయింది.

16 రూతు తన అత్త నయోమి దగ్గరికి వచ్చినప్పుడు నయోమి “అమ్మాయ్, ఏమైంది?” అని అడిగింది. రూతు అతడు తనకు చేసినదంతా వివరించింది. 17 “అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు” అంది. 18 అప్పుడు ఆమె అత్త “అమ్మా, అతడు ఈ రోజే ఈ విషయం తేల్చేవరకూ ఊరుకోడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందో తెలిసేంత వరకూ ఇక్కడే ఉండు” అని చెప్పింది.

4:1 బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు. 2 బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.

3 తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను. 4 ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.

5 అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు. 6 దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.

7 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు. 8 ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.

9 అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం-కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు. 10 అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు” అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.

11 అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక! 12 ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబంలా ఉండుగాక!” అన్నారు.

13 బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. 14 అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక. 15 నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు.

16 అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది. 17 ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.

18 పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను. 19 హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు. 20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. 21 శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. 22 ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.