ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా గిద్యోను

క్రీ.పూ. 1245

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

న్యాయాధిపతులు 6:7–7:25

7 మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు 8 యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను. 9 ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే. 10 మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’”

11 అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, 12 యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, 13 గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు.

14 అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. 15 అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు.

16 అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు. 17 అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు, 18 నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు.

19 అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. 20 దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు. 21 అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. 22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు. 23 అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు.

24 అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది. 25 ఆ రాత్రే యెహోవా “నీ తండ్రికి చెందిన ఎద్దును, ఏడేళ్ళ వయస్సు ఉన్న రెండవ యెద్దును తీసుకు వచ్చి, నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి, దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నరికివెయ్యి. 26 సరి అయిన ఏర్పాటుతో ఈ బండ పైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, ఆ రెండవ ఎద్దును తీసుకు వచ్చి నువ్వు నరికిన ఆషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహనబలి ఆర్పించు” అని అతనితో చెప్పాడు.

27 కాబట్టి గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్టు చేసాడు. అతడు తన తండ్రుల కుటుంబాల వారికి, ఆ ఊరివాళ్ళకు భయపడిన కారణంగా పగటి వేళ కాక, రాత్రి సమయంలో చేసాడు. 28 ఆ ఊరివాళ్ళు వేకువనే లేచినప్పుడు బయలు దేవుడు బలిపీఠం విరగ్గొట్టి ఉంది. దానికి పైగా ఉన్న దేవతా స్తంభం కూడా పడద్రోసి ఉంది. కొత్తగా కట్టిన బలిపీఠంపై రెండవ ఎద్దు అర్పణ అయిపోయి కనిపించింది.

29 అప్పుడు వాళ్ళు, ఇది ఎవరు చేసిన పని, అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాకబు చేసి, యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు.

30 కాబట్టి ఆ ఊరివాళ్ళు “నీ కొడుకు బయలు బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభాన్ని పడద్రోశాడు గనుక అతడు చనిపోవాలి, వాణ్ణి బయటకు తీసుకురా” అని యోవాషుతో చెప్పారు. 31 యోవాషు, తనతో పోట్లాడుతున్న వాళ్ళందరితో “మీరు బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలును రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు పొద్దు ఎక్కక ముందే చావాలి. ఎవడో బయలు బలిపీఠాన్ని విరగ్గొట్టాడు సరే, బయలు దేవుడే కదా, తన పక్షాన తానే వాదించుకోనివ్వండి.” 32 ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా, ఆ దినాన గిద్యోనుకు “యెరుబ్బయలు” అని పేరు వచ్చింది.

33 మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు తీరం వాళ్ళు కలిసివచ్చి, నది దాటి, యెజ్రెయేలు మైదానంలో దిగినప్పుడు 34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబీకులు అతని దగ్గరికి వచ్చారు. 35 అతడు మనష్షె వారి దగ్గరికి దూతలను పంపగా వారంతా కలిసి అతని దగ్గరికి వచ్చారు. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాలవాళ్ళ దగ్గరికి దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా కూడుకొన్న వాళ్ళను కలుసుకున్నారు.

36 అప్పుడు గిద్యోను దేవునితో “నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే, 37 నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను” అన్నాడు. 38 అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు.

39 అప్పుడు గిద్యోను “నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు” అని దేవునితో అన్నప్పుడు 40 ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.

7:1 యెరుబ్బయలు, (అంటే గిద్యోను) అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హరోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరె కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది.

2 యెహోవా గిద్యోనుతో “నీతో ఉన్నవారు ఎక్కువ మంది. నేను వాళ్ల చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు. ఇశ్రాయేలీయులు, ‘నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది’ అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు. 3 కాబట్టి నువ్వు, ‘భయపడి, వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లిపోవాలి’ అని ప్రజలందరూ వినేలా ప్రకటించు” అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లోనుంచి ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్లిపోయారు.

4 ఇంకా అక్కడ పదివేలమంది ఉన్నారు. యెహోవా “ఈ ప్రజలు ఇంకా ఎక్కువమందే. నీళ్ల దగ్గరికి వాళ్లను దిగేలా చెయ్యి. అక్కడ నీ కోసం వాళ్ల సంఖ్య తగ్గిస్తాను. ‘ఇతను నీతో కలిసి వెళ్ళాలి’ అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి. ‘ఇతడు నీతో కలిసి వెళ్లకూడదు’ అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు” అని గిద్యోనుతో చెప్పాడు. 5 అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా “కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్ళు తాగిన వాణ్ణి, నీళ్ళు తాగడానికి మోకాళ్ళు వంచిన వాణ్ణి, వేరువేరుగా ఉంచు” అని గిద్యోనుతో చెప్పాడు. 6 చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగినవాళ్ళు మూడు వందల మంది. మిగిలిన వాళ్ళందరు నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచినవాళ్ళే.

7 అప్పుడు యెహోవా “చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు” అని గిద్యోనుతో చెప్పాడు.

8 ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది. 9 ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు “నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను. 10 వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు. 11 ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు. 12 మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి. 13 గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు. 14 అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు. 15 గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి, 16 ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి. 17 చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి. 18 నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు.

19 కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు. 20 అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు. 21 వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు.

22 ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు, 23 నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు.

24 గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి “మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి” అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు. 25 వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.