ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకున్న మిద్యాను

తూర్పు, ఉత్తర ప్రాంతాల ఇశ్రాయేలీయులను మిద్యాను బానిసలుగా చేసుకుంటుంది, గిద్యోను న్యాయాధిపతి అవుతాడు.

క్రీ.పూ. 1252

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

న్యాయాధిపతులు 6:1–6

1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 2 మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు.

3 ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండేవాళ్ళు, తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండు లాగా వాళ్ళ మీదికి వచ్చి 4 వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు. 5 వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి. 6 దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు.

రూతు కథ క్రీ.పూ. 1245

రూతు 1–2

1 న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యూదా దేశంలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళాడు. 2 అతని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతనికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యూదా దేశపు బేత్లెహేములో నివసించే ఎఫ్రాతా ప్రాంతం వారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ నివసించారు.

3 నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది. 4 వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు. 5 సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.

6 బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది. 7 ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది. 8 అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక. 9 మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక” అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది.

10 అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చి “మేము నీతో కూడా నీ ప్రజల దగ్గరకే వస్తాం” అన్నారు. 11 అప్పుడు నయోమి “నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా. 12 అమ్మాయిలూ, తిరిగి వెళ్ళండి. నేను ముసలిదాన్ని. మగ వాడితో ఇప్పుడు కాపురం చెయ్యలేను. ఒక వేళ నేను నమ్మకంతో ఈ రాత్రి నేను ఒక మగ వాడితో గడిపి కొడుకులను కనినప్పటికీ 13 వాళ్ళు పెద్దవాళ్లయ్యే వరకూ మీరు వేచి ఉంటారా? పెళ్లి చేసుకోకుండా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నా బిడ్డలారా, అలా వద్దు. అలాంటి పరిస్థితి మీకంటే నాకే ఎక్కువ వేదన కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు విరోధి అయ్యాడు” అని వాళ్ళతో అంది. 14 వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.

15 అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది. 16 అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.

18 తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది. 19 కాబట్టి వాళ్ళిద్దరూ బేత్లెహేముకు ప్రయాణం సాగించారు. వాళ్ళు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు ఊరంతా ఎంతో ఆసక్తిగా గుమిగూడారు. ఊరి స్త్రీలు “ఈమె నయోమి కదా” అని చెప్పుకున్నారు.

20 అప్పుడు నయోమి “నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు. 21 నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?” అని వారితో అంది. 22 ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.

2:1 నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు. 2 మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది.

3 ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది. 4 బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు.

5 అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు. 6 అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి. 7 ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు.

8 అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు. 9 కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు.

10 అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. 11 నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు. 12 యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు.

13 అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది. 14 భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.

15 ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో “ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు. 16 అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు” అని చెప్పాడు. 17 కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి. 18 ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది.

19 అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది. 20 దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది. 21 దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది.

22 అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది. 23 రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది.