సొలొమోను పరమగీతం

క్రీ.పూ. 1001

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పరమ గీతము 1–2

1 సొలొమోను రాసిన పరమగీతం.

2 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నీ నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు.

నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం.

3 నువ్వు పూసుకునేవి ఎంతో సువాసన ఉన్న పరిమళ తైలాలు.

నీ పేరు ప్రవహిస్తున్న పరిమళం, అందుకే యువతులు నిన్ను ఇష్టపడతారు.

4 నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం.

(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

రాజు, తన గదుల్లోకి నన్ను తెచ్చాడు.

(ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది.)

నేను సంతోషంగా ఉన్నాను. నీ గురించి నేను ఆనందిస్తున్నాను.

నీ ప్రేమను నన్ను ఉత్సవంలా జరుపుకోనీ.

అది ద్రాక్షారసం కంటే ఉత్తమం.

మిగతా స్త్రీలు నిన్ను పొగడడం సహజం.

5 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

యెరూషలేము ఆడపడుచులారా, నేను నల్లటి పిల్లనే కానీ అందగత్తెను.

కేదారు డేరాల్లాగా, సొలొమోను రాజభవనం తెరల్లాగా నేను అందగత్తెను.

6 నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు.

ఎండ తగిలి అలా అయ్యాను.

నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు.

నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు.

అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు.

7 (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నా ప్రాణ ప్రియా! నీ మందను నీవెక్కడ మేపుతావో నాకు చెప్పు.

మధ్యాహ్నం నీ మందను నీడలో ఎక్కడ ఉంచుతావు?

నీ స్నేహితుల మందల దగ్గర అటూ ఇటూ తిరిగే దానిగా నేనెందుకుండాలి?

8 (తన ప్రియుడు ఆమెకు జవాబిస్తున్నాడు)

జగదేక సుందరీ, నీకు తెలియకపోతే నా మందల అడుగుజాడలను అనుసరించు.

కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లలను మేపుకో.

9 నా ప్రేయసీ, ఫరో రథపు గుర్రాల్లోని ఆడ గుర్రంతో నిన్ను పోలుస్తాను. 10 ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!

11 నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.

12 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

రాజు విందుకు కూర్చుని ఉంటే నా పరిమళం వ్యాపించింది.

13 నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు.

14 ఏన్గెదీ ద్రాక్షాతోటల్లో కర్పూరపు పూగుత్తుల్లాగా నాకు నా ప్రియుడున్నాడు.

15 (ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

ప్రేయసీ, నువ్వు సుందరివి.

చాలా అందంగా ఉన్నావు.

నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే.

16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నన్ను ప్రేమిస్తున్న నువ్వు అతిమనోహరుడివి.

అందగాడివి. పచ్చిక మనకు పాన్పు.

17 మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు.

మన వాసాలు సరళ వృక్షం మ్రానులు.

2:1 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నేను కేవలం మైదానంలోని పువ్వును.

కేవలం లోయలోని లిల్లీ పువ్వును.

2 (ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.

3 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు.

ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను.

అతని పండు ఎంతో రుచిగా ఉంది.

4 అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు.

అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.

5 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను.

ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.

6 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది.

కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.

7 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి.

మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

8 [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు.

పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.

9 నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు.

చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు.

కిటికీలోనుంచి చూస్తున్నాడు.

అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.

10 నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు,

“ప్రియా, లే.

సుందరీ, నాతో వచ్చెయ్యి.

11 చలికాలం పోయింది.

వానలు పడి వెళ్ళిపోయాయి.

12 దేశమంతా పూలు పూశాయి.

కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది.

కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.

13 అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి.

ద్రాక్షచెట్లు పూతపట్టాయి.

అవి సువాసన ఇస్తున్నాయి.

ప్రియా, లే.

సుందరీ, నాతో వచ్చెయ్యి.

14 బండసందుల్లోని నా పావురమా,

కొండ మరుగు చరియల్లోని పావురమా,

నీ ముఖం నన్ను చూడ నివ్వు.

నీ స్వరం వినిపించు.

నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”

15 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి.

తోడేళ్ళను పట్టుకో.

ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.

16 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

నా ప్రియుడు నా వాడు.

నేను అతని దాన్ని.

లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.

17 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

ప్రియా, వెళ్ళిపో.

ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో.

కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.