సొలొమోను పరమగీతం (continued)

క్రీ.పూ. 1001

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పరమ గీతము 3–5

1 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

రాత్రిపూట పడుకుని నేను నా ప్రాణప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని కోసం నేనెంతగానో ఎదురు చూసినా అతడు కనబడలేదు.

2 “నేను లేచి వీధుల గుండా పట్టణమంతా తిరిగి నా ప్రాణప్రియుడి కోసం వెతుకుతాను” అనుకున్నాను. నేనతన్ని వెతికినా అతడు కనబడలేదు.

3 పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకెదురు పడ్డారు. “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని అడిగాను.

4 నేను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం ముందుకు వెళితే, ప్రాణప్రియుడు నాకు కనిపించాడు. నేనతన్ని గట్టిగా పట్టుకుని వదలిపెట్టక నా పుట్టింటికి తీసుకొచ్చాను. నేను కడుపున పడ్డ పడకగది లోకి తీసుకొచ్చాను.

5 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచ వద్దు.

6 [మూడవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

ధూమ స్తంభంలాగా ఎడారి దారిలో వచ్చేది ఏంటది? బోళం, సాంబ్రాణి పరిమళాలతో వర్తకులమ్మే రకరకాల సుగంధ చూర్ణాలతో గుబాళిస్తూ వచ్చేది ఎవరు?

7 అదుగో సొలొమోను పల్లకి. అరవై మంది వీరులు దాని చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు వీరులు.

8 వారంతా కత్తిసాములో నిష్ణాతులు. యుద్ధరంగంలో ఆరితేరిన వారు. రాత్రి పూట జరిగే అపాయాలకు సన్నద్ధులై వస్తున్నారు.

9 లెబానోను మానుతో ఒక పల్లకి సొలొమోనురాజు తనకు చేయించుకున్నాడు.

10 దాని స్తంభాలు వెండితో చేశారు. దాని అడుగుభాగం బంగారుది. దాని దిండ్లు ఊదా రంగువి. యెరూషలేము కుమార్తెలు ప్రేమతో దాని లోపలిభాగం అలంకరించారు.

11 (యువతి యెరూషలేము స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) సీయోను ఆడపడుచులారా, బయటికి వెళ్లి కిరీటం ధరించిన సొలొమోనురాజును కన్నుల పండగగా చూడండి.

అతని పెళ్లి రోజున అతని తల్లి అతనికి ఆ కిరీటం పెట్టింది. అది అతనికి ఎంతో ఆనందకరమైన రోజు.

4:1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

ప్రేయసీ, నువ్వెంత అందంగా ఉన్నావు! ప్రియురాలా! నువ్వెంత అందంగా ఉన్నావు!

నీ ముసుకు గుండా కన్పించే నీ కళ్ళు, గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి.

నీ జుట్టు గిలాదు పర్వతం మీద నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.

2 ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా నీ పళ్ళు ఉన్నాయి.

ఒక్కటీ పోకుండా అవి జోడుజోడుగా ఉన్నాయి.

3 నీ అధరాలు ఎరుపు నూలులాగా ఉన్నాయి.

నీ నోరు మనోజ్ఞంగా ఉంది. నీ ముసుకు గుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.

4 నీ మెడ, వరసల్లో రాళ్ళు పేర్చి కట్టిన దావీదు గోపురంలా ఉంది. దాని మీద వెయ్యి డాలులు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ సైనికుల డాలులే.

5 నీ రెండు స్తనాలు లిల్లీ పూల మధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

6 తెల్లారే లోపు చీకటి నీడలు తొలిగి పోయేలోగా నేను బోళం కొండకు వెళ్తాను. సాంబ్రాణి కొండకు వెళ్తాను.

7 ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు.

8 కళ్యాణీ, లెబానోను విడిచి నాతో రా. లెబానోను విడిచి నాతో రా.

అమానా పర్వత శిఖరం నుంచి, శెనీరు హెర్మోను శిఖరాల నుంచి సింహాల గుహలనుంచి, చిరుతపులుండే గుహలున్న కొండలపైనుంచి కిందికి దిగి రా.

9 నా సోదరీ, వధూ! నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు. నీ హారంలోని ఒక్క ఆభరణంతో నన్ను దోచుకున్నావు.

10 నా సోదరీ, సఖీ! నీ ప్రేమ ఎంత మధురం! ద్రాక్షారసం కంటే నీ ప్రేమ ఎంత శ్రేష్ఠం!

నువ్వు పూసుకున్న పరిమళాల వాసన సుగంధ ద్రవ్యాలన్నిటి కన్నా మించినది.

11 వధూ! నీ పెదాలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక కింద తేనె, పాలు తొణికిసలాడుతున్నాయి.

నీ వస్త్రాల సువాసన లెబానోను సువాసనలాగా ఉంది.

12 నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.

13 నీ కొమ్మలు దానిమ్మతోటలా ఉన్నాయి. దానిలో రక రకాల పళ్ళ చెట్లున్నాయి. గోరింటాకు, జటామాంసి,

14 కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి.

బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.

15 నువ్వు ఉద్యాన వనంలోని నీటి ఊట. మంచినీటి బావి. లెబానోను నుంచి ప్రవహించే సెలయేరు.

16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఉత్తర గాలీ, రా! దక్షిణ గాలీ, రా! నా ఉద్యానవనం మీద వీచు.

వాటి సుగంధాల పరిమళాలను వ్యాపింపనీ. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తాడు గాక! దాని శ్రేష్ట ఫలాలను అతడు తింటాడు గాక!

5:1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు).

నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను.

తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను.

నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు.

2 [నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది)

నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది.

నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి.

నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”

3 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా?

కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?

4 తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.

5 నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను.

నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.

6 నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను.

నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.

7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు.

వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు.

ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.

8 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

9 (పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)

జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి?

నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?

10 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.

11 అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.

12 అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.

13 అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.

14 అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.

15 అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి.

అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం.

16 అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం.

యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.