సొలొమోను పరమగీతం (continued)

క్రీ.పూ. 1001

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పరమ గీతము 6–8

1 (యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)

జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము.

2 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు.

సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.

3 నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు.

[ఐదవ భాగం] (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

4 ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి.

నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను.

5 నీ కళ్ళు నాపైనుండి తిప్పుకో. అవి నన్ను లొంగతీసుకుంటున్నాయి. నీ జుట్టు గిలాదు పర్వత సానువుల నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.

6 నీ పళ్ళు ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా ఉన్నాయి. ఒక్కటీ పోకుండా జోడుజోడుగా ఉన్నాయి.

7 నీ ముసుకుగుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.

8 (ప్రియుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు)

అరవై మంది రాణులూ ఎనభై మంది ఉపపత్నులూ లెక్క పెట్టలేనంత మంది యువతులూ ఉన్నారు.

9 నా పావురం, ఏ దోషం లేనిది. ఈమె ఒక్కతే. ఈమె తన తల్లికి ఒకతే కూతురు. కన్నతల్లికి గారాబు బిడ్డ.

మా ప్రాంతం ఆడపడుచులు ఆమెను చూసి, చాలా ధన్య అన్నారు. రాణులూ ఉపపత్నులూ ఆమెను చూసి ప్రశంసించారు.

10 తొలిసంధ్యలా విరాజిల్లుతూ, జాబిల్లిలా మనోజ్ఞంగా, భానుతేజ ప్రకాశంతో, వ్యూహంగా ఏర్పడిన సైన్యమంత భయద సౌందర్యం గల ఈమె ఎవరు?

11 నేను బాదం చెట్ల తోటలోకి దిగి వెళ్లాను. లోయలో పెరిగే మొక్కలు చూడడానికి వెళ్లాను.

ద్రాక్షావల్లులు పూతకొచ్చాయో లేదో చూడడానికి, దానిమ్మ చెట్లు పూస్తున్నాయో లేదో చూడడానికి వెళ్లాను.

12 రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది.

13 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి.

(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు?

7:1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి.

2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది.

కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది.

3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

4 నీ మెడ దంతగోపురంలా ఉంది.

నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి.

నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది.

5 నీ తల కర్మెలు పర్వతంలా ఉంది.

నీ జుట్టు ముదురు ఊదా రంగు.

నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.

6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!

7 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు.

నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి.

8 “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను.

నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి.

9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.

మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.

10 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నేను నా ప్రియుడికి చెందిన దాన్ని.

అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.

11 ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.

12 పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో,

వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద.

అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను.

13 మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి.

మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.

8:1 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

నా తల్లి పాలు తాగిన నా సోదరునిలా నువ్వు నాకుంటే ఎంత బాగు!

అప్పుడు నువ్వు బయట ఎదురు పడితే నీకు ముద్దులిచ్చేదాన్ని.

అప్పుడు నన్నెవరూ నిందించరు.

2 నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను.

నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావు.

తాగడానికి నీకు సుగంధ ద్రాక్షారసాన్ని, నా దానిమ్మ పళ్ళ రసాన్ని ఇస్తాను.

3 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది).

అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది.

అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు

4 (యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ

మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

5 [ఆరవ భాగం-ముగింపు]

(యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు)

తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు?

(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను.

అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది.

6 నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.

ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది.

మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది.

దాని మంటలు ఎగిసి పడతాయి.

అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.

వరదలు దాన్ని ముంచలేవు.

ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.

8 (ఆ యువతి సోదరులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు).

మాకొక చిన్నారి చెల్లి ఉంది. ఆమె స్తనాలు ఇంకా పెరగలేదు.

ఆమె నిశ్చితార్థం రోజున మా చెల్లి కోసం మేమేం చెయ్యాలి?

9 ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం.

ఆమె తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో దానికి గడులు పెడతాం.

10 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

నేను గోడలా ఉండేదాన్ని.

అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి.

కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా ఉన్నా.

11 బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది.

అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు కౌలు చెల్లించాలి.

12 నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే.

దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి.

13 (ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ.

14 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.