భాగం 5: షేబ రాణి సొలొమోనును సందర్శించడం
సొలొమోను గొప్పతనం, షేబ రాణి సందర్శన.
క్రీ.పూ. 992
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
15 యెహోవా మందిరాన్ని, తన స్వంత రాజగృహాన్ని, మిల్లోను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు అనే పట్టణాలను కట్టించడానికి సొలొమోను వెట్టిపనివారిని పెట్టాడు. 16 అంతకుముందు ఐగుప్తు రాజు ఫరో గెజెరు పైకి దండెత్తి దాన్ని పట్టుకుని, అగ్నితో కాల్చి ఆ పట్టణంలోని కనానీయులను హతమార్చాడు. అతడు తన కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు.
12 అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు. 13 అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
14 అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు. 15 ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.
16 యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.
25 సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, శాంతి బలులు అర్పిస్తూ, యెహోవా సన్నిధిలో ఉన్న వేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు మందిరాన్ని కట్టడం పూర్తి చేశాడు.
26 సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు. 27 హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతోబాటు ఓడల మీద పంపించాడు. 28 వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.
17 సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు.
14 సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు. 15 ఇది గాక, వర్తకులూ, అరబి రాజులూ, దేశాధికారులూ అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు. 16 సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలు మూడున్నర కిలోల బంగారంతో చేశారు. 17 రేకులుగా కొట్టిన బంగారంతో అతడు 300 చిన్న డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు దగ్గరగా రొండు కిలోల బంగారం వాడారు. రాజు వీటిని లెబానోను అరణ్య రాజగృహంలో ఉంచాడు.
18 రాజు ఒక పెద్ద దంతపు సింహాసనం చేయించి దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. 19 ఈ సింహానానికి 6 మెట్లున్నాయి. సింహాసనం పైభాగం వెనక వైపు గుండ్రంగా ఉంది. ఆసనానికి ఇరుపక్కలా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలు నిలిచి ఉన్నాయి. 20 ఆరు మెట్లకూ రెండు వైపులా పన్నెండు సింహాలు నిలిచి ఉన్నాయి. అలాటి సింహాసనాన్ని మరే రాజ్యంలో ఎవరూ చేసి ఉండలేదు.
21 సొలొమోను రాజు పానపాత్రలు బంగారపువి. లెబానోను అరణ్య మందిరంలోని పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను రోజుల్లో వెండికి విలువ లేదు. 22 సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతోబాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకు వస్తుండేవి. 23 ఈ విధంగా సొలొమోను రాజు ఐశ్వర్యం, జ్ఞానం విషయాల్లో భూరాజులందరినీ అధిగమించాడు. 24 అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానపు మాటలను వినడానికి లోకప్రజలంతా అతని చెంతకు రావాలని ఆశించారు. 25 అతనిని కలిసిన ప్రతి వ్యక్తీ కానుకగా వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు, ప్రతి సంవత్సరం తెచ్చేవాడు.
26 సొలొమోను రథాలను రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపురౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లోఉంచాడు. కొన్నింటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు. 27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు.
28 ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు. 29 వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి ఒకటిన్నర కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ అరాము రాజులకూ తగిన ధరకు అమ్మారు.
26 సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి. 27 సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు. 28 రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.
34 అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.