భాగం 5: షేబ రాణి సొలొమోనును సందర్శించడం (continued)

సొలొమోను గొప్పతనం, షేబ రాణి సందర్శన.

క్రీ.పూ. 992

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 10:1–13

1 షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది. 2 ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.

3 ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికి సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు. 4 షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని, 5 అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు.

6 ఆమె రాజుతో ఇలా అంది. “నీవు చేసిన పనుల గురించీ నీ జ్ఞానం గురించీ నా దేశంలో నేను విన్న మాట నిజమే. 7 కానీ నేను వచ్చి నా కళ్ళారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్నదానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి.

8 నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు! 9 నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”

10 షేబ దేశపు రాణి సొలొమోనుకు సుమారు నాలుగున్నర వేల బంగారం, బహు విస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు. 11 ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు అక్కడి నుండి గంధం చెక్క, రత్నాలు, ఎంతో విస్తారంగా తెచ్చాయి. 12 ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలూ, గాయకులకు సితారాలూ స్వరమండలాలూ చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా. 13 సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా, దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది.

1 రాజులు 9:17–23

17 సొలొమోను గెజెరును తిరిగి కట్టించాడు. కింద ఉన్న బేత్‌ హోరోనును, 18 బయతాతు, అరణ్యంలో ఉన్న తద్మోరు పట్టణాలను, 19 సొలొమోను భోజన పదార్థాలను నిల్వ చేయడానికి, రథాల కోసం, రౌతుల కోసం పట్టణాలను కట్టించాడు. ఇవి గాక అతడు యెరూషలేములో, లెబానోనులో, తన పాలన కింద ఉన్న దేశమంతటిలో తాను వేటిని కట్టాలని కోరుకున్నాడో వాటన్నిటినీ కట్టించాడు.

20 అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో సంబంధంలేని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, అనే జాతుల్లో కొందరు మిగిలి ఉన్నారు. 21 ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా నశింపజేయలేక పోయారు. మిగిలి ఉన్న ఆ జాతుల ప్రజలను సొలొమోను బానిసలుగా నియమించాడు. ఈ రోజు వరకూ వారు అలాగే ఉన్నారు. 22 అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా తన రథాలకు, రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు.

23 సొలొమోను చేయించిన పనిని అజమాయిషీ చేయడానికి ఉన్న ముఖ్య అధికారులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 8:18

18 హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.

2 దినవృత్తాంతాలు 9:13–28

13 సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 వేల కిలోలు. 14 అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు. 15 సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి 200 డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు కిలోగ్రాముల బంగారం పట్టింది. 16 సాగగొట్టిన బంగారంతో 300 కవచాలు చేయించాడు. ఒక్కొక్క కవచానికి మూడు కిలోగ్రాముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబానోను అరణ్యంలో ఉన్న తన అంతఃపురంలో ఉంచాడు.

17 సొలొమోను రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి మేలిమి బంగారంతో దాన్ని పొదిగించాడు. 18 ఆ సింహాసనానికి ఆరు బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి రెండు వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలున్నాయి. 19 ఆ ఆరు మెట్ల మీద రెండు వైపులా 12 సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. మరి ఏ రాజ్యంలోనూ అలాటి పని ఎవరూ చేసి ఉండలేదు.

20 సొలొమోను రాజుకున్న పానపాత్రలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్యం అంతఃపురంలో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో చేశారు. హీరాము పంపిన పనివారితో కలిసి రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, ఏనుగు దంతం, కోతులు, నెమళ్ళు మొదలైన సరకులతో వచ్చేవి. 21 సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు.

22 సొలొమోను రాజు భూమి పైన రాజులందరికంటే ఐశ్వర్యంలో, జ్ఞానంలో అధికుడయ్యాడు. 23 దేవుడు సొలొమోను హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులంతా అతనిని దర్శించాలని కోరేవారు. 24 ఒక్కొక్కరూ ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకు వచ్చారు.

25 సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో, తన దగ్గర, యెరూషలేములో, గుర్రాలకు, రథాలకు 4,000 శాలలు ఉండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు. 26 యూఫ్రటిసు నది మొదలుకుని ఫిలిష్తీయుల దేశం వరకూ, ఐగుప్తు సరిహద్దు వరకూ ఉన్న రాజులందరిపై అతడు పరిపాలన చేశాడు. 27 సొలొమోను యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా, దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడివృక్షాలంత విస్తారంగా ఉండేలా చేశాడు. 28 ఐగుప్తు నుండీ ఇతర అన్ని దేశాల నుండీ సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి.

2 దినవృత్తాంతాలు 1:14–17

14 సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు. 15 రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.

16 సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండీ కవే ప్రాంతం నుండీ తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు. 17 వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండినీ, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండినీ ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకూ, సిరియా రాజులకూ కూడా ఎగుమతి చేశారు.

2 దినవృత్తాంతాలు 9:1–12

1 షేబ రాణి సొలొమోను గొప్పతనం గూర్చి విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని, గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాటలాడింది. 2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది.

3 షేబ రాణి సొలొమోను జ్ఞానాన్నీ అతడు కట్టించిన నగరాన్నీ 4 అతని భోజనపు బల్ల మీది పదార్ధాలు, అతని అధిపతులు కూర్చుండడం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు, వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులు, వీటన్నిటినీ చూసినప్పుడు, ఆమె ఎంతో విస్మయానికి గురైంది.

5 ఆమె రాజుతో “నీ పనులను గురించీ, నీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని, నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకూ వారి మాటలు నమ్మలేదు. 6 నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదాని కంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది. 7 నీ సేవకులెంత భాగ్యవంతులు! ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు. 8 నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు” అని చెప్పింది.

9 ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలనూ రత్నాలనూ ఇచ్చింది. షేబదేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు. 10 అంతే కాక, ఓఫీరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారూ సొలొమోను పనివారూ అక్కడి నుంచి గంధం మానులు, ప్రశస్తమైన రత్నాలు కూడా తెచ్చారు. 11 ఆ గంధం కొయ్యలతో రాజు యెహోవా మందిరానికి, రాజనగరానికి మెట్లూ, గాయకులకి తంబురలూ సితారాలూ చేయించాడు. అటువంటి చెక్కడపు పని అంతకు ముందు యూదా దేశంలో ఎవ్వరూ చూడలేదు.

12 షేబ దేశపు రాణి రాజుకు తీసుకు వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయింది.