భాగం 4: సొలొమోను ఇతర భవనాలు, వైభవం
సొలొమోనుకు దేవుని ప్రత్యక్షత
లెబానోను అరణ్య భవన నిర్మాణం. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమవుతాడు.
క్రీ.పూ. 1004
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు. 2 అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.
3 పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి. 4 మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి. 5 తలుపుల, కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. మూడు వరసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
6 అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు, మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి.
7 తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకూ దేవదారు కర్రతో కప్పారు. 8 సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు.
9 ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి. 10 దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది. 11 పై భాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్లు, దేవదారు కర్రలు ఉన్నాయి.
12 ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరంలోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు.
11 ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు.
12 అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. 13 నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14 నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 15 ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. 16 నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి. 17 నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే, 18 ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు, అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను.
19 అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే, 20 నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను. 21 అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, ‘యెహోవా ఈ దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు. 22 అప్పుడు మనుషులు, ‘ఈ దేశ ప్రజలు తమ పూర్వికులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారిమీదకి రప్పించాడు’ అని చెబుతారు.”
1 సొలొమోను యెహోవా మందిరం, రాజగృహాల నిర్మాణం, తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరవాత, 2 యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు.
3 యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి. 4 నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలనూ, విధులనూ పాటిస్తే, 5 ‘నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు’ అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.
6 అయితే మీరు గాని, మీ సంతానం గాని నానుండి తొలగిపోయి, నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే, 7 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.
8 ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు. 9 అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, ‘వారు ఐగుప్తు దేశం నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారి పైకి రప్పించాడు.’”
సొలొమోను దిగ్విజయాలు, ఇతర కార్యాలు క్రీ.పూ. 1001
10 సొలొమోను యెహోవా మందిరం, రాజగృహం, రెంటినీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత దేవదారు, సరళ వృక్షపు కలపను, బంగారాన్నీ అతనికి ఇచ్చాడు. 11 కాబట్టి సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు. 12 హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు. 13 కాబట్టి అతడు “సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాటివి” అన్నాడు. హీరాము అ ప్రదేశాన్ని కాబూల్ అన్నాడు. ఈ రోజు వరకూ వాటికి “కాబూల్” అని పేరు. 14 హీరాము నాలుగు టన్నుల బంగారాన్ని రాజుకు పంపించాడు.
1 సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత 2 హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.
3 తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 4 అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు. 5 ఇంకా అతడు ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు. 6 బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.
7 ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని 8 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.
9 అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు. 10 వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.
11 “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి” అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.
24 ఫరో కూతురు దావీదుపురం నుండి సొలొమోను తన కోసం కట్టించిన రాజగృహానికి వచ్చిన తరువాత అతడు మిల్లోను కట్టించాడు.