యోషీయా యొక్క నిబంధనను ప్రజలకు గుర్తుచేయడం
క్రీ.పూ. 610
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. 2 “మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. 3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు. 4 ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’” 5 అందుకు నేను “యెహోవా, అలాగే జరుగు గాక” అన్నాను.
6 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలు ప్రకటించు. ‘మీరు ఈ నిబంధన మాటలు విని వాటిని పాటించండి.’ 7 ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో ‘నా మాట వినండి’ అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను. 8 అయినా వారు తమ దుష్టహృదయంతో, మూర్ఖులై నడుచుకుంటూ నామాట వినలేదు. ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవమని చెప్పినా వారు వినలేదు కాబట్టి నేను ఆ నిబంధనలోని శాపాలన్నిటినీ వారి మీదికి రప్పిస్తాను.”
9 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “యూదా ప్రజల్లో, యెరూషలేము నివాసుల్లో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. 10 అదేమంటే, ఇశ్రాయేలు, యూదా వంశస్థులు నా మాటలు వినని తమ పూర్వీకుల దోషాలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. వారు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటిని అనుసరిస్తూ వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను భంగం చేశారు.”
11 కాబట్టి యెహోవా చెప్పేదేమంటే “వారు తప్పించుకోలేని విపత్తును వారి మీదికి రప్పిస్తాను, వారు నన్ను ఎంత వేడుకున్నా నేను వినను. 12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు. 13 యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.
14 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.
15 దుష్ట తలంపులు కలిగిన నా ప్రియమైన ప్రజలకు నా మందిరంతో పనేంటి?
బలుల కోసం నువ్వు మొక్కుకుని తెచ్చిన ప్రతిష్ఠితమైన మాంసం భుజించడం వలన నీకు ప్రయోజనం లేదు.
ఎందుకంటే నువ్వు చెడు జరిగించి సంతోషించావు.
16 గతంలో యెహోవా నిన్ను, ‘ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్టు’ అని పిలిచాడు.
అయితే ఆయన గొప్ప తుఫాను శబ్దంలా వినిపించే మంట రగిలించాడు. దాని కొమ్మలు విరిగిపోతాయి.
17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”
18 దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు. 19 అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు.
20 సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు.
యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.
21 “నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, 22 “నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు. 23 వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.”
12:1 యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు.
అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను.
దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?
2 వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు.
వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే.
3 యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు.
వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు.
4 దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి.
వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు.
5 యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు?
నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు?
6 నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు.
వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు.
7 నేను నా మందిరం విడిచిపెట్టాను. నా వారసత్వాన్ని వదిలేశాను.
నా ప్రియమైన ప్రజలను వారి శత్రువుల చేతికి అప్పగించాను.
8 నా వారసత్వం నాకు అడవిలోని సింహంలాగా అయ్యింది. అది నా మీద గర్జిస్తూ ఉంది. కాబట్టి అది నాకు అసహ్యం అయ్యింది.
9 నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి.
రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి.
10 అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు.
నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు.
11 వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు.
12 వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు.
దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు.
13 ప్రజలు గోదుమలు చల్లారు కానీ ముండ్ల పంట కోస్తారు. పనిలో అలసిపోతున్నారు గాని ప్రయోజనం లేదు.
యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.
14 యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను. 15 ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.”
16 వారు “బయలు తోడు” అని ప్రమాణం చేయడం నా ప్రజలకు నేర్పారు. ఇప్పుడు వారు “యెహోవా జీవం తోడు” అని నా పేరున ప్రమాణం చేయడానికి నా ప్రజల విధానాలను జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య అభివృద్ధి చెందుతారు. 17 అయితే వారు నా మాట వినకపోతే నేను ఆ జనాలను వేరుతో సహా పెళ్ళగించి వారిని సంపూర్ణంగా నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.