యిర్మీయా పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ విలపించడం (continued)
చెర సమీపిస్తుండగా యిర్మీయా పశ్చాత్తాపపడమని ప్రజలను కోరుతూ, వారి కష్టాలను బట్టి విలపిస్తాడు.
క్రీ.పూ. 612
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.
ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
2 నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.
నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.
3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.
4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.
ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.
5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.
6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
7 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?
8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.
ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.
9 ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?
ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
10 పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను.
ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు.
ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.
11 యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను.
యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.
12 ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు?
ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
13 యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు. 14 తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”
15 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ ప్రజలు చేదుకూరలు తినేలా చేస్తాను. విషజలం తాగిస్తాను. 16 వారు గానీ, వారి పూర్వికులు గానీ ఎరగని జాతి ప్రజల్లోకి వారిని చెదరగొడతాను. వారు పూర్తిగా నాశనం అయ్యేవరకూ వారి పైకి ఖడ్గం పంపుతాను.”
17 సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి.
విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
18 మనం కన్నీళ్లు విడిచేలా, మన కనురెప్పల నుండి నీళ్లు కారిపోయేలా వారు త్వరగా వచ్చి రోదన ధ్వని చేయమని చెప్పండి.”
19 “మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు.
మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది” అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.
20 స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి.
మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.
21 మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది.
అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
22 యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి.
వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”
23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.
అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
25 యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను. 26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”
10:1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి.
2 యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి.
వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
3 ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు.
4 అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు.
5 అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి.
అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.
6 యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.
7 లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
8 వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
9 తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు.
అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.
10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు.
ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
11 మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
14 ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.
15 అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
16 యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
17 ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.”
18 యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను.
వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”
19 అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది.
అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను.
20 నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు.
నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
21 కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.
22 అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది.
23 యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.
24 యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
25 నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు.
ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.