యిర్మీయా పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ విలపించడం

చెర సమీపిస్తుండగా యిర్మీయా పశ్చాత్తాపపడమని ప్రజలను కోరుతూ, వారి కష్టాలను బట్టి విలపిస్తాడు.

క్రీ.పూ. 612

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 7–8

1 యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు 2 “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. 3 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి. 4 ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”

5 మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి. 6 పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు. 7 అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.

8 అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు. 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, 10 అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా? 11 నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.

12 గతంలో నేను నా సన్నిధిని ఉంచిన షిలోహుకు వెళ్లి పరిశీలించండి. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని బట్టి నేను దానికి ఏం చేశానో చూడండి. 13 నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు. 14 కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను. 15 మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.

16 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను. 17 యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావు కదా. 18 నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. 19 నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా? 20 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.

21 సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి. 22 నేను ఐగుప్తు దేశం నుండి మీ పూర్వికులను రప్పించిన రోజున వారి నుండి ఏమీ కోరలేదు. దహన బలుల గురించీ ఇంకా ఇతర బలుల గురించీ నేను వారికి ఆజ్ఞాపించలేదు. 23 ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”

24 అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు. 25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను. 26 అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.

27 నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాట వినరు. నువ్వు పిలిచినా వారు బదులు చెప్పరు. 28 కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.

29 తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు.

నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.

30 యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు,

నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.

31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు. 32 యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.

33 అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు. 34 ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”

8:1 యెహోవా చెప్పేదేమంటే ఆ సమయంలో మీ శత్రువులు యూదా రాజుల, వారి అధిపతుల ఎముకలను, యాజకుల, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను వారి సమాధుల్లో నుండి బయటికి తీస్తారు. 2 వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి. 3 ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.

4 యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. “కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?”

5 మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు?

వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?

6 నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు.

“నేనిలా చేశానేమిటి?” అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు.

యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు.

7 ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు.

అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.

8 “మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు?

నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.

9 జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు.

వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?

10 కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను.

చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.

11 శాంతి లేని సమయంలో వారు “శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు” అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.

12 వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు.

అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు.

నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.

13 నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి.

నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.

14 “మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి.

యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు.

15 మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు.

క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు.

16 దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది.

వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.

17 యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’”

18 నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది?

19 యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి.

వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?

20 కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు.

21 నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది.

22 గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?