యోషీయా మరణం

క్రీ.పూ. 610

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 35:20–24

20 ఇదంతా అయిన తరువాత, యోషీయా మందిరాన్ని చక్కపెట్టిన తరువాత ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యోషీయా అతనితో పోరాడడానికి వెళ్ళాడు. 21 అయితే నెకో అతని దగ్గరికి రాయబారులను పంపి “యూదా రాజా, నాకూ నీకూ విరోధమేంటి? నేను ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి రాలేదు, కానీ నేను యుద్ధం చేయబోతున్న వాడి పైకి వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి దేవుని జోలికి నీవు రావద్దు. ఆయన నాతో ఉన్నాడు. లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు” అని చెప్పాడు.

22 అయినా యోషీయా అతని దగ్గరనుంచి వెళ్ళిపోడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయడానికి మారువేషం వేసుకుని, యెహోవా నోటిమాటగా నెకో చెప్పింది వినలేదు. మెగిద్దో లోయలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు.

23 విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో “నాకు పెద్ద గాయం అయింది. ఇక్కడ నుంచి నన్ను తీసుకు వెళ్ళండి” అన్నాడు. 24 కాబట్టి అతని సేవకులు రథం మీదనుంచి అతని దింపి, అతనికున్న వేరే రథం మీద అతని ఉంచి యెరూషలేము తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టారు. యూదా యెరూషలేము వారంతా యోషీయా మృతికి విలపించారు.

2 రాజులు 23:25–27

25 అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు.

26 అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది. 27 కాబట్టి యెహోవా “నేను ఇశ్రాయేలు వాళ్ళను వెళ్లగొట్టినట్టు యూదా వాళ్ళను నా సముఖానికి దూరం చేసి, నేను కోరుకొన్న యెరూషలేము పట్టణాన్నీ, నా పేరును అక్కడ ఉంచుతానని నేను చెప్పిన మందిరాన్నీ నేను విసర్జిస్తాను” అనుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 35:25–27

25 యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి. 26 యోషీయాను గురించిన ఇతర విషయాలు, యెహోవా ధర్మశాస్త్రంలో రాసిన మాటలు బట్టి అతడు చూపిన భయభక్తులు, 27 అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి.

2 దినవృత్తాంతాలు 34:1–2

1 యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.

2 రాజులు 22:3–23:3

3 రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో, 4 “నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు. 5 యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.

6 వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు” అన్నాడు. 7 ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.

8 అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి 9 రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి, 10 “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.

11 రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. 12 తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు. 13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.

14 కాబట్టి యాజకుడైన హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు. 15 ఆమె వాళ్ళతో “మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి. 16 యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.

17 ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది. 18 యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి. 19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.

20 నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.

23:1 అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి, 2 యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు.

3 రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు.

2 రాజులు 23:22–24

22 ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం, యూదా రాజుల కాలం వరకూ ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ సమయంలో పస్కా పండగ జరిగింది. 23 ఈ పండగ రాజైన యోషీయా పరిపాలన 18 వ సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది.

24 ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.

2 రాజులు 23:28–30

28 యోషీయా చేసిన ఇతర పనులు గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 29 అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు. 30 అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి, మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి, అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.