భాగం 12: నీడలో యేసుతో

క్రీ.శ. 30 (లేదా 29), శ్రమల వారంలోని మంగళవారం మధ్యాహ్నం నుండి గురువారం రాత్రి వరకు. యెరూషలేము

యేసు ఇప్పుడు తన మరణ విషాదానికి శిష్యులను సిద్ధపరచడానికీ, తాను వెళ్ళిపోయిన తరువాత తన పనిని కొనసాగించడానికి వారిని సంసిద్ధులను చేయడానికీ ప్రయత్నిస్తాడు.

అంత్యకాలాన్ని గురించిన గొప్ప ప్రసంగం

ఒలీవ చెట్ల కొండపై కూర్చుని, యేసు తన శిష్యులతో యెరూషలేము నాశనం గురించీ తన రెండవ రాకడ గురించీ అంత్యకాల దర్శనాల భాషలో మాట్లాడుతాడు. అంత్య విషయాలను గురించిన గొప్ప ప్రసంగం.

(మంగళవారం మధ్యాహ్నం)

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 24:1–25:46

24:1 యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు. 2 అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు.

3 ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు.

4 యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.

5 చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.

6 అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.

7 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.

8 ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.

9 “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.

10 ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. 11 అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. 12 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.

13 కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. 14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

15 “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),

16 యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.

17 మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.

18 పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.

19 అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.

20 అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి. 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. 22 ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.

23 “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.

24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.

25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. 26 కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.

27 “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది. 28 శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.

29 “ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.

30 అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.

31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.

32 “అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.

33 అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.

34 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.

35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

36 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. 37 నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.

40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.

42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.

43 దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.

45 “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49 తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51 వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”

25:1 “పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు. 2 వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు. 3 తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. 4 తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు. 5 పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు.

6 అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది. 7 అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు.

8 అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు. 9 అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు.

10 వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు. 11 ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. 12 కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. 13 ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.

14 “పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. 15 వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు.

16 ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. 17 అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. 18 అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.

19 “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. 20 అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు.

21 అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.

22 అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 23 యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.

24 తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. 25 కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు.

26 అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! 27 అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, 28 ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.

29 ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 30 పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.

31 “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.

32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.

34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.

41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

మార్కు రాసిన సువార్త 13:1–37

13:1 యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు. 2 యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు.

3 యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు.

4 “ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”

5 యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి.

6 చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు.

7 మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.

8 జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే.

9 మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.

11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.

12 సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. 13 నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.

14 “వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.

15 మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.

16 పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.

17 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.

18 ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.

19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.

20 దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.

21 ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.

22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.

23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.

24 “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో,

సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.

25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి.

ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.

26 అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.

27 అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”

28 “అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు.

29 అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి.

30 నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.

31 ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.

33 జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.

34 “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు.

35 కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! 37 నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

లూకా రాసిన సువార్త 21:5–36

21:5 దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 6 అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు.

7 అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు.

8 ఆయన, “మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. చాలా మంది నా పేర వచ్చి, ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.

9 మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.

10 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది. 11 కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.

12 ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.

13 దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది. 14 కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి. 15 మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను.

16 తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు. 17 నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. 18 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. 19 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.

20 యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.

21 అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.

22 ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.

23 ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.

24 వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.

25 “ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు. 26 ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు.

27 అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.

28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.

29 తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి. 30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా!

31 అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.

32 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను.

33 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.

34 “తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి. 35 ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.

36 కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.