రెండు రోజుల్లో తాను సిలువ వేయబడతానని యేసు ముందుగా చెప్పడం
ఇప్పటి నుండి రెండు రోజుల్లో (యూదుల శుక్రవారం నాడు) తాను సిలువ వేయబడతానని యేసు ముందుగా చెబుతాడు.
బహుశా మంగళవారం సాయంత్రం (యూదుల బుధవారం ఆరంభం) బేతనియలో. యెరూషలేములోని పాలకులు ఆయనను చంపడానికి కుట్ర పన్నుతారు
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 26:1–5
26:1 యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, 2 “రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు.
3 ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు.
4 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు.
5 అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు.
మార్కు రాసిన సువార్త 14:1–2
14:1 రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.
2 అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి, పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు.
లూకా రాసిన సువార్త 22:1–2
22:1 పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
2 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.
బేతనియ మరియ యేసు సమాధి కోసం ఆయనను అభిషేకించడం
కుష్ఠురోగి సీమోను ఇంట్లో జరిగిన విందులో, బేతనియ మరియ యేసు సమాధి కోసం ఆయనను అభిషేకిస్తుంది.
బేతనియలో (మంగళవారం సాయంత్రం, యూదుల బుధవారం)
మత్తయి రాసిన సువార్త 26:6–13
26:6 యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. 7 ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది.
8 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం!
9 దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు.
10 యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది.
11 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను.
12 ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది.
13 నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.”
మార్కు రాసిన సువార్త 14:3–9
14:3 ఆ సమయంలో యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన, ప్రశస్తమైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది.
4 అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, “అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు?
5 ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది” అని తమలో తాము చెప్పుకుని ఆ స్త్రీని గద్దించారు.
6 అయితే యేసు, “ఆమె జోలికి వెళ్ళకండి! ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్ఠమైన పని చేసింది.
7 పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని, నేను ఎల్లకాలం మీతో ఉండను.
8 ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది.
9 మీతో నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతిచోటా ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు” అన్నాడు.
యోహాను రాసిన సువార్త 12:2–8
12:2 అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు. 3 అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
4 ఆయనను అప్పగించ బోతున్నవాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా,
5 “ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?” అన్నాడు.
6 అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
7 యేసు, “ఈమెను ఇలా చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీన్ని సిద్ధపరచింది.
8 పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా” అన్నాడు.