యేసును అప్పగించడానికి యూదా బేరమాడడం

విందులో యేసు గద్దింపుతో మనసు నొచ్చుకున్న యూదా, ఆయనను అప్పగించడానికి పాలకులతో బేరమాడతాడు.

మంగళవారం రాత్రి యెరూషలేములో

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 26:14–16

26:14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు.

15 “యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.

16 అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

మార్కు రాసిన సువార్త 14:10–11

14:10 ఆ తరువాత పన్నెండు మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు.

11 అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురు చూస్తూ ఉన్నాడు.

లూకా రాసిన సువార్త 22:3–6

22:3 అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.

4 దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.

5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.

6 అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.

ఒక స్నేహితుని ఇంట్లో పస్కా భోజనం సిద్ధపరచడం

ఒక స్నేహితుని ఇంట్లో (బహుశా యోహాను మార్కు తల్లిదండ్రుల ఇంట్లో) పస్కా భోజనానికి సన్నాహాలు.

యెరూషలేము, గురువారం మధ్యాహ్నం. (సిద్ధపాటు దినం)

మత్తయి రాసిన సువార్త 26:17–19

26:17 పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు.

18 అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు.

19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.

మార్కు రాసిన సువార్త 14:12–16

14:12 పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు.

13 యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి.

14 అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి.

15 అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు.

16 ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు.

లూకా రాసిన సువార్త 22:7–13

22:7 పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.

8 యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. 9 వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. 10 ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.

11 మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.

12 అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు.

13 సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు.

యేసు పన్నెండుగురితో పస్కా భోజనం చేయడం

యేసు పన్నెండుగురు అపొస్తలులతో పస్కా భోజనం చేసి, వారి అసూయను గద్దిస్తాడు.

యెరూషలేము, గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత (యూదుల శుక్రవారం ఆరంభం)

మత్తయి రాసిన సువార్త 26:20

26:20 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.

మార్కు రాసిన సువార్త 14:17

14:17 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు.

లూకా రాసిన సువార్త 22:14–16, 24–30

22:14 సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.

15 అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. 16 ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”

24 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.

28 “నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు. 29 నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి, 30 సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.