యేసు శాస్త్రులనూ పరిసయ్యులనూ ఖండించడం
యేసు తన చివరి బహిరంగ ప్రసంగంలో శాస్త్రులనూ పరిసయ్యులనూ గంభీరంగా ఖండిస్తాడు.
దేవాలయ ప్రాంగణంలో. (మంగళవారం)
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 23:1–39
23:1 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
2 “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. 3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. 4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.
6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.
7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9 ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. 12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
13 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. 14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.
15 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.
16 “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.
17 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? 18 అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.
19 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? 20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.
24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. 25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.
26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.
29 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.
30 ‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు. 31 నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. 32 ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.
33 “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. 34 కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది. 36 అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
37 “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు. 38 ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను 39 ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”
మార్కు రాసిన సువార్త 12:38–40
12:38 ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ,
39 సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు.
40 వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
లూకా రాసిన సువార్త 20:45–47
20:45 ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు.
46 వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు.
47 వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.
పేద విధవరాలి కానుకను యేసు మెచ్చుకోవడం
యేసు దేవాలయంలో అర్పిస్తున్న కానుకలను నిశితంగా గమనించి, పేద విధవరాలి కానుకను మెచ్చుకుంటాడు.
(మంగళవారం)
మార్కు రాసిన సువార్త 12:41–44
12:41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. 42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది.
43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.
లూకా రాసిన సువార్త 21:1–4
21:1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు.
3 అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.