ధర్మశాస్త్ర నిపుణుడైన ఒక పరిసయ్యుడు యేసును ప్రశ్నించడం

సద్దూకయ్యుల ఓటమిని చూసి పరిసయ్యులు సంతోషిస్తారు. పరిసయ్యుడైన ఒక ధర్మశాస్త్ర నిపుణుడు ధర్మశాస్త్రం గురించి యేసును ఒక ప్రశ్న అడుగుతాడు.

దేవాలయ ప్రాంగణంలో. (మంగళవారం)

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 22:34–40

22:34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు. 35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి,

36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

37 అందుకు యేసు,

“‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 12:28–34

12:28 ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు.

29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే.

30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.

31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.

32 ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే. 33 పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.

34 అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.

దావీదు కుమారుని విషయమై యేసు తన శత్రువులను మౌనపరచడం

మెస్సీయ దావీదు సంతతివాడై ఉండి కూడా దావీదుకు ప్రభువుగా ఎలా ఉన్నాడనే సూటి ప్రశ్నతో యేసు తన శత్రువులను మౌనపరచగా, జనసమూహం సంతోషిస్తుంది.

దేవాలయ ప్రాంగణంలో. (మంగళవారం)

మత్తయి రాసిన సువార్త 22:41–46

22:41 మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,

42 “క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు.

వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.

43 అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ 44 నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?

45 దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు.

46 ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.

మార్కు రాసిన సువార్త 12:35–37

12:35 యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?

36 దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ,

‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు,

నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు.

37 దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.

లూకా రాసిన సువార్త 20:41–44

20:41 ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు?

42-43 “నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.

44 దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?” అన్నాడు.