గలతీయులు తమ మొదటి విశ్వాసాన్ని విడిచిపెడతారు

మోషే ధర్మశాస్త్రం కింద తెలియని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, వరాల ద్వారా కొత్త వ్యవస్థ వారికి ధృవీకరించబడినప్పటికీ, అది రక్షణకు సరిపోదని భావించి తమ విశ్వాసపు తొలి సూత్రాలను విడిచిపెట్టినందుకు పౌలు గలతీయులను గద్దిస్తాడు.

క్రీ.శ. 51

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

గలతీయులకు రాసిన పత్రిక 3:1–5

1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా! 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా? 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?

4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?

విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన అబ్రాహాము

దేవుని వాగ్దానాలలో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన అబ్రాహాము ఉదాహరణతో పౌలు తన బోధ సత్యమని నిరూపిస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 3:6–18

6 అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” 7 కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. 9 కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.

10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”

13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14 అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.

17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.

మోషే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది

ఎవరి వంశంలో క్రీస్తు పుట్టవలసి ఉందో ఆ యూదులను అన్యమతస్థుల విగ్రహారాధన పద్ధతులు, క్రతువుల నుండి దూరంగా ఉంచడమూ, వాగ్దానం చేయబడిన మెస్సీయ కోసం ఆశతో ఎదురుచూసేలా వారికి శిక్షణ ఇవ్వడమూ మోషే ధర్మశాస్త్రం ఉద్దేశమని పౌలు ప్రకటిస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 3:19–29

19 అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. 20 మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.

21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. 23 మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. 24 కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది.

25 అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

వారు మళ్లీ బానిసత్వంలోకి వెళ్తారని పౌలు భయపడతాడు

పౌలు మరో దృష్టాంతాన్ని జోడించి, ధర్మశాస్త్రం ఉద్దేశాన్ని చూపిస్తాడు. విశ్వాసులైన యూదులు, యూదేతరులు తమను తాము మళ్లీ బానిసత్వంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నందుకు వారిని గద్దిస్తాడు. ఆ కారణంగా వారి గురించి భయపడతాడు.

గలతీయులకు రాసిన పత్రిక 4:1–11

1 నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు. 2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు. 3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.

4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు. 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.

8 ఆ కాలంలో మీరు దేవుని ఎరగనివారై, వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు గాని 9 ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? 10 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట. 11 మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.

పౌలు వారి పూర్వపు ఆసక్తిని గుర్తుచేసి విజ్ఞప్తి చేస్తాడు

యూదులు గతంలో చూపిన ఆసక్తిని, తనపై వారికున్న ప్రేమను గుర్తుచేసి పౌలు వారికి విజ్ఞప్తి చేస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 4:12–20

12 సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. 13 మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.

15 మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను. 16 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?

17 వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు. 18 నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది.

19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను. 20 మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.