ఫిలిప్పి నుండి తెస్సలోనికకు

ఫిలిప్పి నుండి అంఫిపొలి, అపొల్లోనియ గుండా తెస్సలోనికకు. అక్కడ యాసోను వారిని వ్యతిరేకిస్తాడు.

క్రీ.శ. 50

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అపోస్తలుల కార్యములు 17:1–9

1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. 2 పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. 3 క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.

4 కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.

5 అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.

6 అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. 7 వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు. 8 జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు. 9 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.

పౌలు గలతీయులకు రాయడం క్రీ.శ. 51

వారి రక్షణకు కారణం క్రీస్తులో విశ్వాసమే గానీ, ఆచార సంబంధమైన ధర్మశాస్త్రానికి వారు చూపిన అసంపూర్ణ విధేయత కాదని యూదా ఆచారాలను బోధించే బోధకులకు వ్యతిరేకంగా నిరూపించడానికి పౌలు గలతీయులకు తన పత్రిక రాస్తాడు.

పౌలు గలతీయులకు అభివందనాలు తెలుపుతాడు

పౌలు తన అపొస్తలత్వాన్ని సమర్థించుకొని సహోదరులకు అభివందనాలు తెలుపుతాడు.

గలతీయులకు రాసిన పత్రిక 1:1–5

1 మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ, 2 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

అతని సువార్తను విడిచిపెట్టినందుకు గలతీయులకు గద్దింపు

పౌలు తన సువార్త నుండి తొలగిపోయినందుకు గలతీయులను గద్దిస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 1:6–10

6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. 8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. 9 మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.

పౌలు అపొస్తలత్వం దేవుని నుండి వచ్చింది

అబద్ధ బోధకులకు జవాబుగా, పౌలు తన అపొస్తలత్వాన్ని దేవుని నుండి పొందానని నొక్కిచెబుతూ, తన పరివర్తనను, తనకు అప్పగించిన బాధ్యతను, తన జీవితపు సాధారణ గమనాన్ని వివరిస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 1:11–2:10

11 సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. 15 అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని 16 ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. 17 నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.

18 మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. 19 అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.

20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. 21 ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ 23 “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, 24 వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.

2:1 పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను. 2 మేము వెళ్ళాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్ళాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న సువార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ఏకాంతంగా వివరించాను.

3 అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికీ సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు. 4 క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనలను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరులు ప్రవేశించారు. 5 సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.

6 ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నేను చెప్పిన సందేశానికి ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు. 7 అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు సువార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు. 8 అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగజేశాడు.

9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.

యూదా ఆచారాలను అనుసరింపజేస్తున్నందుకు పౌలు పేతురును గద్దిస్తాడు

యూదా ఆచారాలను అనుసరింపజేస్తున్నందుకు పౌలు పేతురును గద్దిస్తాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారనే సిద్ధాంతాన్ని సమర్థిస్తాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన యూదులే ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం రక్షణను ఇవ్వలేదని నమ్మితే, యూదేతరులు దానిని పాటించాలని ఆశించడం గానీ, అది వారిని బంధించడం గానీ అసాధ్యమని వాదిస్తాడు.

గలతీయులకు రాసిన పత్రిక 2:11–21

11 అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు. 14 వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.

15 మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. 16 మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.

17 అయితే, దేవుడు మనలను క్రీస్తులో నీతిమంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు. 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా. 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.

20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.