సువార్త నిబంధన కంటే తక్కువ స్థాయిలో ఉన్న ధర్మశాస్త్రం
సువార్త నిబంధన కంటే ధర్మశాస్త్రం తక్కువ స్థాయిలో ఉందని చూపిస్తూ, పాత నిబంధనలోని ఒక దృష్టాంతంతో పౌలు తన విజ్ఞప్తిని కొనసాగిస్తాడు.
క్రీ.శ. 51
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గలతీయులకు రాసిన పత్రిక 4:21–31
21 ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా? 22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.
24 ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
27 “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు.
ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.
ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.
28 సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. 29 అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. 30 అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” 31 అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.
ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసిన బాధ్యత
రక్షణ కోసం యూదుల ధర్మశాస్త్రంపై ఆధారపడేవారంతా క్రైస్తవ వ్యవస్థలోని ఆశీర్వాదాన్ని తమకు తామే దూరం చేసుకుంటూ, ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసిన బాధ్యతకు లోనవుతారని పౌలు నొక్కిచెబుతాడు. సువార్తలోని ఆధ్యాత్మిక మతం కోరే కృపా లక్షణాలను, సద్గుణాలను ఆచరించమని వారిని ప్రోత్సహిస్తాడు. మోషే ధర్మశాస్త్రం ఖండించిన నైతిక అపరాధాలకు దూరంగా ఉండేలా వారు జాగ్రత్తపడాలి. క్రైస్తవుల మధ్య ఎంతో ప్రకోపానికి, అసూయకు కారణమయ్యే వ్యర్థ గర్వపు ఆత్మను, ప్రత్యేక గుర్తింపు పొందాలనే కోరికను అణచివేయాలి.
1 స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
2 మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను. 3 సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు. 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
7 మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? 8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు. 9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
10 మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. 11 సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
12 మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది. 13 సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
16 నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24 క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం. 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
క్రైస్తవ ప్రేమ చూపమని పౌలు ప్రోత్సహిస్తాడు
క్రైస్తవ ప్రేమ చూపమని పౌలు వారిని ప్రోత్సహిస్తాడు. వారి సొంత బలహీనతలు, తమ క్రియల గురించి అందరూ లెక్క అప్పగించవలసి ఉన్నందున వాటిని పరిశీలించుకోవలసిన అవసరం, పరిచర్య పోషణకూ మానవులందరి అవసరాలకూ, ముఖ్యంగా మన తోటి క్రైస్తవుల అవసరాలకూ తోడ్పడవలసిన కర్తవ్యం ఆధారంగా ఇలా ప్రోత్సహిస్తాడు.
1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
3 ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. 5 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
పౌలు యేసు ముద్రలను మోస్తున్నాడు
యూదామతాభిమానులు ధర్మశాస్త్రాన్ని పాటించలేదనీ, తాము హింసను తప్పించుకోవడానికే తమ అనుచరులు సున్నతి పొందాలని కోరుకున్నారనీ గలతీయులకు గుర్తుచేస్తూ పౌలు ముగిస్తాడు. అయితే తాను ప్రభువైన యేసు కోసం అనుభవించిన బాధల ముద్రలను తన శరీరంపై మోస్తున్నందున, అలాంటి స్వార్థపూరిత ఉద్దేశాలు తనను కదిలించలేవని పౌలు ప్రకటిస్తాడు. దేవుని దృష్టిలో పరిశుద్ధత ఒక్కటే విలువైనదని సాక్ష్యమిస్తాడు. సంఘానికి ఆశీర్వాదం కలగాలని ప్రార్థిస్తాడు.
గలతీయులకు రాసిన పత్రిక 6:11–18
11 నా సొంత దస్తూరీతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి. 12 శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. 17 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. 18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్.