విగ్రహారాధన మూర్ఖత్వం, యూదేతరుల విశ్వాస పరివర్తన

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 44–45

1 అయినా నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న ఇశ్రాయేలూ, విను.

2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు,

“నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ, భయపడకు.

3 నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను.

నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.

4 నీటి కాలవల దగ్గర నాటిన నిరవంజి చెట్లు గడ్డిలో పెరిగినట్టు వారు పెరుగుతారు.

5 ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు.

మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”

6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు,

“నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు.

7 ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు?

అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి.

8 మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా?

మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.

9 విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.

10 ఎందుకూ పనికిరాని విగ్రహాన్ని పోత పోసి దాన్ని ఒక దేవుడిగా నిరూపించేవాడెవడు?

11 ఇదిగో, దాన్ని పూజించే వారంతా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు మానవ మాత్రులే గదా?

వారందరినీ పోగు చేసి నిలబెడితే వారు తప్పకుండా భయపడతారు, సిగ్గుపడతారు.

12 కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు.

అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు.

13 వడ్లవాడు చెక్క మీద నూలు తాడు వేసి గీత గీస్తాడు. దాన్ని చిత్రిక పట్టి నునుపుగా చేస్తాడు.

ఎండ్రకాయ గుర్తు పెట్టి దాన్ని తయారు చేస్తాడు.

మందిరంలో నిలబెట్టడం కోసం ఒక మానవ రూపాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాడు.

14 ఒకడు దేవదారు చెట్లను నరకడానికి పూనుకుంటాడు. లేక సరళ వృక్షాన్నో సింధూర వృక్షాన్నో ఏదొక అడవి వృక్షాన్ని ఎన్నుకుంటాడు.

ఒకడు ఒక చెట్టును నాటినప్పుడు అది వర్షం సాయంతో పెరుగుతుంది.

15 అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు.

మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.

16 కొంత చెక్కను నిప్పుతో కాల్చి, దానిపై మాంసం వండుకుని తిని తృప్తి పొందుతాడు. ‘ఆహా, చలి కాచుకున్నాను, వెచ్చగా ఉంది’ అనుకున్నాడు.

17 మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు.

దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు.

18 వారికి తెలియదు, అర్థం చేసుకోరు. వారు చూడకుండేలా వారి కళ్ళు, అర్థం చేసుకోకుండేలా వారి హృదయాలు మూసుకుపోయాయి.

19 ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను.

మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా?

ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు.

20 వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు.

‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు.

21 యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను.

ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.

22 మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.

23 యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి.

పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి.

యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”

24 గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు,

“యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.

25 నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి.

సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.

26 నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే.

యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను.

దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే.

27 నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.

28 కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”

45:1 యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు.

“అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను.

నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.

2 నేను నీకు ముందు వెళ్తూ ఉన్నత స్థలాలను చదును చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనపగడియలను విరగ్గొడతాను.

3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి.

చీకటి స్థలాల్లో ఉన్న నిధుల్నీ రహస్యంగా దాచి ఉన్న ధనాన్నీ నీకిస్తాను.

4 నేను నీకు తెలియకపోయినా నా సేవకుడు యాకోబు కోసం,

నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు కోసం నేను నిన్ను పేరుతో పిలిచాను. నీకు బిరుదులిచ్చాను.

5 నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు.

6 తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా

నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

7 వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.

8 అంతరిక్షమా, పైనుండి కురిపించు. ఆకాశాలు నీతిన్యాయలు వర్షించనీ.

భూమి విచ్చుకుని రక్షణ మొలకెత్తేలా నీతిని దానితో బాటు మొలిచేలా చెయ్యనీ. యెహోవానైన నేను దాన్ని కలిగించాను.

9 మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ.

బంకమట్టి కుమ్మరితో ‘నువ్వేం చేస్తున్నావ్?’ అనవచ్చా? ‘నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?’ అనగలదా?

10 ‘నీకు పుట్టినదేమిటి?’ అని తన తండ్రినీ, ‘నువ్వు దేనిని గర్భం ధరించావు?’ అని తల్లినీ అడిగే వాడికి బాధ తప్పదు.”

11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెబుతున్నాడు,

“జరగబోయే విషయాలకు సంబంధించి, నా పిల్లలను గురించీ, నా చేతి పనులను గురించీ నాకే ఆజ్ఞాపిస్తారా?

12 భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.

13 నీతిని బట్టి కోరెషును ప్రేరేపించాను, అతని మార్గాలన్నిటినీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు,

ఏమీ వెల గానీ, లంచం గానీ పుచ్చుకోకుండానే చెరలో ఉన్నవారిని అతడు విడిపిస్తాడు.”

14 యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు “ఐగుప్తీయుల సంపాదన, కూషు వ్యాపార లాభాలు, నీకు దొరుకుతాయి. ఎత్తుగా ఉండే సెబాయీయులు నీకు లొంగిపోతారు. వారు సంకెళ్ళతో నీవెంట వచ్చి నీకు సాగిలపడతారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడు’ అని చెబుతూ నిన్ను వేడుకుంటారు.”

15 రక్షకుడవైన ఇశ్రాయేలు దేవా, నిజంగా నువ్వు నిన్ను కనబడకుండా చేసుకునే దేవుడవు.

16 విగ్రహాలు చేసే వారు సిగ్గుపడతారు. వారంతా అవమానం పాలవుతారు. వారిలో ప్రతి ఒక్కడూ కలవరానికి గురవుతాడు.

17 యెహోవా ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, అవమానం పాలు కారు.

18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు.

నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు.

ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.

19 ఎక్కడో చీకటిలో రహస్య స్థలం నుండి నేను మాట్లాడలేదు.

అదృశ్యంగా ఉండి, ‘నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు.

నేను న్యాయంగా మాట్లాడేవాణ్ణి, యెహోవా అనే నేను యథార్థమైన సంగతులు తెలిపేవాణ్ణి.

20 కలిసి రండి, వివిధ రాజ్యాల్లో పరవాసులుగా ఉన్నవారంతా నా దగ్గర సమకూడండి.

చెక్కిన విగ్రహాలను మోస్తూ రక్షించలేని ఆ దేవుళ్ళకు మొరపెట్టేవారు బుద్ధిహీనులు.

21 నా సన్నిధిలోకి వచ్చి సంగతులు వివరించండి. ప్రజలు వారిలో వారిని సంప్రదించుకొనియండి.

పూర్వకాలం నుండీ ఆ కార్యాలను ఎవరు తెలుపుతూ ఉన్నారు?

చాలకాలం కిందటే దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా?

నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను న్యాయవంతుడైన దేవుణ్ణి. నేనే రక్షించేవాణ్ణి. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

22 భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.

23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను.

నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.

24 ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.”

మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.

25 ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.