క్రీస్తు రాక గురించి ముందస్తు ప్రకటన

క్రీస్తు రాకను గురించి, యూదుల పునరుద్ధరణను గురించి ఒక ప్రవచనం.

క్రీ.పూ. 710 నుండి 699 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 42–43

1 ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు.

ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.

2 ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు.

3 నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు.

ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.

4 భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు.

సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి.

5 ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి,

దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,

6 “గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు.

7 యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను.

నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.

8 నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను.

9 గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.”

10 సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.

భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.

11 ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి.

సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు.

12 ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు.

13 యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు.

తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.

14 చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను.

ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను.

15 పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను.

నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను.

16 గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను.

వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను.

17 చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు.

18 చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి.

19 నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు?

20 నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు.

21 యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు.

22 అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు.

వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు.

23 మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు?

24 వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు.

25 దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు.

అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.

43:1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు,

“నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

3 యెహోవా అనే నేను నీకు దేవుణ్ణి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నీ రక్షకుణ్ణి.

నీ ప్రాణరక్షణ క్రయధనంగా ఐగుప్తును, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను.

4 నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.

5 భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను.

దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు.

7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.

8 కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి

9 రాజ్యాలన్నీ గుంపులుగా రండి. ప్రజలంతా సమావేశం కండి. వారిలో ఎవరు ఇలాటి సంగతులు చెప్పగలిగారు?

గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించ గలిగి ఉండేవారు? తమ యథార్థతను రుజువు చేసుకోడానికి తమ సాక్షులను తేవాలి. లేకపోతే వాళ్ళు విని ‘అవును, అది నిజమే’ అని ఒప్పుకోవాలి.

10 నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించేలా మీరు, నేను ఎన్నుకున్న నా సేవకుడు నాకు సాక్షులు.

నాకంటే ముందు ఏ దేవుడూ ఉనికిలో లేడు, నా తరవాత ఉండడు.

11 యెహోవా అనే నేను నేనొక్కడినే. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

12 ప్రకటించిన వాడినీ నేనే, రక్షించిన వాడినీ నేనే. దాన్ని గ్రహించేలా చేసిందీ నేనే. మీలో ఇంకా వేరే దేవత ఎవరూ లేరు.

నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు.” ఇదే యెహోవా వాక్కు.

13 “నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?”

14 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మీ విమోచకుడు యెహోవా ఇలా చెబుతున్నాడు,

“మీ కోసం నేను బబులోనుపై దండెత్తి వారు గర్వకారణంగా భావించే ఓడల్లోనే పారిపోయేలా చేస్తాను.

15 మీ పరిశుద్ధ దేవుణ్ణి, యెహోవాను నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని.”

16 సముద్రంలో రహదారి కలిగించినవాడూ, నీటి ప్రవాహాల్లో మార్గం ఏర్పాటు చేసేవాడూ

17 రథాలూ, గుర్రాలూ, సైన్యాన్నీ యుద్ధవీరుల్నీ రప్పించినవాడూ అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు,

వారంతా ఒకేసారి పడిపోయారు. ఆరిపోయిన జనపనారలాగా మళ్ళీ లేవకుండా నాశనమైపోయారు.

18 “గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు.

19 ఇదిగో, నేనొక కొత్త కార్యం చేస్తున్నాను. అది ఇప్పటికే మొదలైంది. మీరు దాన్ని గమనించరా?

నేను అరణ్యంలో దారి నిర్మిస్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.

20 అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. ఎందుకంటే నేను ఏర్పరచుకొన్న ప్రజలు తాగటానికి అరణ్యంలో నీళ్ళు పుట్టిస్తున్నాను. ఎడారిలో నదులు పారజేస్తాను.

21 నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు.

22 కానీ యాకోబూ, నువ్వు నాకు మొర్రపెట్టడం లేదు. ఇశ్రాయేలూ, నా విషయంలో విసిగిపోయావు.

23 దహనబలుల కోసం నీ గొర్రెల్నీ మేకల్నీ నా దగ్గరికి తేలేదు. బలులర్పించి నన్ను ఘనపరచలేదు.

నైవేద్యాలు చేయాలని నేను నీపై భారం మోపలేదు. ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.

24 నా కోసం సువాసన గల లవంగపు చెక్కను నువ్వు డబ్బు ఇచ్చి కొనలేదు.

నీ బలి పశువుల కొవ్వుతో నన్ను తృప్తిపరచకపోగా, నీ పాపాలతో నన్ను విసిగించావు. నీ దోషాలతో నన్ను రొష్టుపెట్టావు.

25 ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.

26 ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో.

27 నీ మూలపురుషుడు పాపం చేశాడు. నీ నాయకులు నామీద తిరుగుబాటు చేశారు.

28 కాబట్టి దేవాలయంలో ప్రతిష్ఠితులైన నాయకులను అపవిత్రపరుస్తాను. యాకోబును శాపానికి గురిచేసి, దూషణ పాలు చేస్తాను.”