చెర, బబులోను నాశనం గురించి ముందస్తు ప్రకటన

బబులోను చెరను గురించి, బబులోను నాశనాన్ని గురించి ఒక ప్రవచనం.

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 46–47

1 బేలు కూలిపోతూ ఉన్నాడు. నెబో కృంగుతూ ఉన్నాడు. వారి విగ్రహాలను జంతువులు, పశువులు మోస్తూ వెళ్తున్నాయి.

2 వాటిని మోయడం పశువులకు భారంగా ఉంది, అవి సొమ్మసిల్లి పోతున్నాయి.

అవి క్రుంగుతూ, తూలుతూ ఆ విగ్రహాలను కాపాడ లేక పోగా తాము కూడా చెరగా పట్టుబడ్డాయి.

3 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానంలో మిగిలిన వారలారా, మీరు గర్భంలో ప్రవేశించింది మొదలుకుని నేను మిమ్మల్ని భరించాను.

మీరు తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. నా మాట వినండి.

4 నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే.

నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే.

5 నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు?

6 ప్రజలు విస్తారమైన బంగారం తెచ్చి పోస్తారు. వెండిని తెచ్చి బరువు తూస్తారు.

ఒక కంసాలిని జీతానికి పిలిచి అతనికి దాన్ని అప్పగిస్తారు. అతడు దాన్ని ఒక దేవుడుగా రూపొందిస్తాడు. వారు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారు.

7 వారు దాన్ని తమ భుజాల మీద ఎక్కించుకుంటారు. దాన్ని మోసుకుపోయి దాని స్థానంలో నిలబెడతారు.

అది అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. ఒకడు దానికి మొర్రపెట్టినా జవాబు చెప్పదు, ఎవరి బాధా తీసివేయలేదు, రక్షించలేదు.

8 ఈ విషయాలు ఆలోచించండి. వాటిని మర్చిపోవద్దు. తిరుగుబాటు చేసే మీరు దీన్ని ఆలోచించండి.

9 చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.

10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను.

“నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను.

11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను.

నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించినదాన్ని సఫలం చేస్తాను.

12 బండబారిన హృదయాలతో నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.

13 నా నీతిని మీకు దగ్గరగా తెచ్చాను. అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యం కాదు.

సీయోనుకు నా రక్షణ అందిస్తాను. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహిస్తాను.

47:1 బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో.

కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో.

నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.

2 తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి.

కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు.

3 నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది.

నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను.

4 మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు.

5 కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో.

రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు.

6 నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను.

కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు.

7 నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు,

వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.

8 కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు.

నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను.

9 పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి.

నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి.

10 నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు.

నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి.

11 వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు.

కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు.

నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.

12 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు.

ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో.

13 నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు.

జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి,

నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు.

14 వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది.

అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు.

అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు.

15 నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు.

నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు.

నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.