విగ్రహారాధనపై గద్దింపు

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 48

1 యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను.

నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు.

నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు.

ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు.

అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.

2 మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని,

వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.

3 ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.

4 నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.

5 అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను.

“నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.

6 నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.

7 అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు.

“అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు.

8 నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు.

పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు.

9 నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను.

నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.

10 నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.

11 నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి?

నా ఘనత మరెవరికీ ఇవ్వను.

12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను.

నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.

13 నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది.

నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.

14 మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు?

యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.

15 ఔను. నేనే ఇలా చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి రప్పించాను. అతడు చక్కగా చేస్తాడు.

16 నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి.

మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను.

ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.

17 నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు.

“నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను.

నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.

18 నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది!

అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది.

19 నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు.

వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.

20 బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి!

యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!

21 ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు.

వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు.

ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి.

22 “దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.

తన ప్రజలతో మెస్సీయ మాట్లాడడం

యెషయా 49

1 ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి.

నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు.

2 ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు.

ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు.

3 ఆయన నాతో “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి. నీలో నా ఘనత చూపిస్తాను” అని చెప్పాడు.

4 నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది.

5 యెహోవా దృష్టికి నేను గౌరవనీయుణ్ణి.

నా దేవుడు నాకు బలం. తనకు సేవకుడుగా ఉండడానికి, తన దగ్గరికి యాకోబును మళ్ళీ రప్పించాలనీ ఇశ్రాయేలును ఆయన దగ్గరికి చేర్చేలా నన్ను గర్భంలో రూపొందించాడు.

యెహోవా ఇలా చెబుతున్నాడు.

6 “నువ్వు యాకోబు గోత్రాలను ఉద్ధరించడానికీ ఇశ్రాయేలులో తప్పించుకున్నవాళ్ళను తీసుకురావడానికీ నా సేవకుడుగా ఉండడం ఎంతో చిన్న విషయం.

నువ్వు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేస్తాను.”

7 మనుషుల తృణీకారానికీ రాజ్యాల ద్వేషానికీ గురై పరిపాలకులకు బానిసగా ఉన్నవానితో,

ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు,

“యెహోవా నమ్మకమైనవాడనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనీ

రాజులు తెలుసుకుని నిలబడతారు. అధికారులు నీ ఎదుట వంగుతారు.”

8 యెహోవా ఇలా చెబుతున్నాడు,

“అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను.

దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ

నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను.

9 నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు.

వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది.

10 వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు.

కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు.

11 నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.”

12 చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు.

13 బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు.

ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

14 అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది.

15 స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

16 చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

17 నీ పిల్లలు త్వరగా వస్తున్నారు. నిన్ను నాశనం చేసినవాళ్ళు వెళ్ళిపోతున్నారు.

18 అటూ ఇటూ చూడు. వాళ్ళంతా కలిసి నీ దగ్గరికి వస్తున్నారు. నా జీవం తోడని యెహోవా ఇలా చెబుతున్నాడు. “నువ్వు వీళ్ళందరినీ ఆభరణంగా ధరించుకుంటావు. పెళ్ళికూతురులాగా నువ్వు వారిని ధరించుకుంటావు.

19 నువ్వు పాడైపోయి నిర్జనంగా ఉన్నా నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంది.

నిన్ను మింగివేసినవారు దూరంగా ఉంటారు.

20 నీ దుఃఖదినాల్లో నీకు పుట్టిన పిల్లలు ‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది.

మేము ఉండడానికి ఇంకా విశాలమైన ప్రాంతం మాకివ్వు’ అంటారు.

21 అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, ఈ పిల్లలను నా కోసం ఎవరు కన్నారు?

నేను నా పిల్లలను కోల్పోయి ఏడ్చాను. గొడ్రాలిని, బందీని అయ్యాను. ఈ పిల్లలను ఎవరు పెంచారు?

నేను ఏకాకినయ్యాను. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు?”

22 ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు,

“నేను రాజ్యాల వైపు నా చెయ్యి ఎత్తుతాను. ప్రజలకు నా జెండాను సంకేతంగా ఎత్తుతాను.

వాళ్ళు నీ కొడుకులను తమ చేతుల్లో తీసుకు వస్తారు. నీ కూతుళ్ళను తమ భుజాలమీద మోసుకువస్తారు.

23 రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు.

వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు.

అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”

24 బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము ఎవడు తీసుకోగలడు? నియంత దగ్గర నుంచి బందీలను ఎవడు విడిపించగలడు?

25 అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు,

“నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది.

నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.

26 నిన్ను బాధించేవారు తమ సొంత మాంసం తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు తమ సొంత రక్తంతో వాళ్ళు మత్తులవుతారు.

అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడిననీ నీ విమోచకుడిననీ మనుషులంతా తెలుసుకుంటారు.”