భాగం 7: నిర్గమనం
క్రీ.పూ. 1491
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
31 ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. 32 మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. 33 ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.
34 ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. 35 అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. 36 ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు.
40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. 41 ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. 42 ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.