భాగం 8: అరణ్యంలో సంచారం

మొదటి ప్రయాణం: రామెసేసు నుండి సుక్కోతుకు

క్రీ.పూ. 1491

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంఖ్యాకాండం 33:1–5

1 మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు. 2 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు. 3 మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు. 4 ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.

5 ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.

నిర్గమకాండం 12:37–39

37 తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. 38 అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. 39 తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.

పస్కాను ఆచరించాలనే ఆజ్ఞ పునరుద్ధరణ

నిర్గమకాండం 12:43–13:19

43 తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. 44 మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. 45 వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. 46 ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.

47 ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. 48 మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. 49 స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.”

50 యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. 51 ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.

13:1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”

3 అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. 4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. 5 కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.

6 మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి. 7 ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.

8 ఆ రోజు మీ పిల్లలకు ‘నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను’ అని చెప్పాలి. 9 యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.

10 అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి. 11 యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత 12 మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.

13 ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. 14 ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు. 15 ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి. 16 యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.”

17 ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు. 18 అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.

19 మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు “దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి” అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.