భాగం 6: పది తెగుళ్ళ ముగింపు

తొమ్మిదవ తెగులు: మూడు రోజుల చీకటి

క్రీ.పూ. 1491

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నిర్గమకాండం 10:21–27

21 అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు.

22 మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది. 23 ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.

24 ఫరో మోషేను పిలిపించాడు. “మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు” అన్నాడు. 25 అందుకు మోషే “మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది. 26 మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి” అని చెప్పాడు.

27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.

పదవ తెగులు: తొలి సంతానం వధ

తొలి సంతానం మరణిస్తుందని బెదిరింపు

నిర్గమకాండం 11:1–8

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు. 2 కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.”

3 యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు. 4 మోషే ఫరోతో ఇలా అన్నాడు “యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను. 5 ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.

6 అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు. 7 యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు. 8 అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.

నిర్గమకాండం 10:28–29

28 అప్పుడు ఫరో “బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు” అన్నాడు. 29 అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.

నిర్గమకాండం 11:9–10

9 అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు. 10 మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.

పస్కా భోజనం చేయడం

నిర్గమకాండం 12:21–28

21 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. 22 తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. 23 యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.

24 అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. 26 మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, 27 ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. 28 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

తొలి సంతానం వధ

నిర్గమకాండం 12:29–30

29 ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. 30 ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది.