శిష్యులు స్వస్థపరచలేకపోయిన దయ్యం పట్టిన బాలుడు

కైసరయ ఫిలిప్పు ప్రాంతంలో

క్రీ.శ. 29 లేదా 28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 17:14–21

17:14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి,

15 “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు.

16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు.

17 అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.

18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.

19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు.

20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 9:14–29

9:14 మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు.

15 ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.

16 యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు.

17 ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను.

18 ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.

19 అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు.

20 వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.

21 యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. 22 ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.

23 యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు. 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.

25 యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.

26 ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. 27 కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.

28 యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.

29 ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.

లూకా రాసిన సువార్త 9:37–43

9:37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.

38 ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు.

39 చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది. 40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు.

41 యేసు, “విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?” అని, “నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా” అని ఆ తండ్రితో చెప్పాడు.

42 వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.

43 అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

యేసు మళ్లీ తన మరణం, పునరుత్థానం గురించి ముందుగా చెప్పడం

గలిలయ గుండా గోప్యంగా తిరిగి వస్తూ, యేసు మళ్లీ తన మరణం, పునరుత్థానం గురించి ముందుగా చెబుతాడు.

మత్తయి రాసిన సువార్త 17:22–23

17:22 వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు, “మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు, 23 వారు ఆయనను చంపుతారు. కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు” అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు.

మార్కు రాసిన సువార్త 9:30–32

9:30 వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.

31 ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.

32 కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు.

లూకా రాసిన సువార్త 9:44–45

9:44 ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు”

45 అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.